2024లో వైసీపీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. 11 సీట్లకే పరిమితమై ఘోర పరాభవం పాలైన పార్టీలో కొనసాగేందుకు చాలామంది ఇష్టపడడం లేదు. ఈ క్రమంలోనే బాలినేని మొదలు మోపిదేవి వరకు ఎందరో కరుడుగట్టిన వైఎస్ఆర్ అభిమానులు సైతం పార్టీని వీడడంతో జగన్ కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి.
ఈ క్రమంలోనే జగన్ కు కర్నూలు జిల్లా వైసీపీ మైనారిటీ నేత ఇంతియాజ్ తాజాగా షాకిచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారి, కర్నూలు వైసీపీ ఇన్చార్జి ఇంతియాజ్ అహ్మద్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఇంతియాజ్ తాజాగా పార్టీని వీడారు.
ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సూచనతో రాజీనామా చేశానని వెల్లడించారు. ఇకపై సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటానని తెలిపారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ చేతిలో ఓటమి తర్వాత ఇంతియాజ్ అహ్మద్ పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా కనిపించడం లేదు.