ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చి బాధితులను ఆదుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి లేఖ రాయడం జరిగింది.@AndhraPradeshCM pic.twitter.com/cyq2CD1hdP
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) June 14, 2021
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఎం జగన్ తప్పిన హామీలపై నిలదీస్తున్న విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా ఆయన ఢిల్లీలోనే ఉంటున్నా..రచ్చబండ పేరుతో.. ఏపీ రాజకీయాలపై తనదైన శైలిలో బాంబులు పేలుస్తున్నారు.
ఇపుడు రఘురామరాజు ఎపిసోడ్స్ సీజన్ 2 నడుస్తోంది. జగన్ ను ఇపుడు జగన్ మాటలతోనే బుక్ చేస్తూ లేఖలు రాస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నాలుగు లేఖలు సంధించి సంచలనంగా మారిన ఆయన ఇప్పుడు ఐదో లేఖ రాశారు.
ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం విడుదల చేయాలని సీఎం జగన్ను ఎంపీ రఘురామ కోరారు. ఈ మేరకు సీఎంకు వరుసగా ఐదో లేఖ రాశారు. ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గత నాలుగు రోజులుగా జగన్కు రఘురామ లేఖలు రాస్తున్నారు.
తొలి నాలుగు రోజుల్లో వృద్ధాప్య పింఛన్ల పెంపు, సీపీఎస్ రద్దు, పెళ్లికానుక.. షాదీముబారక్, ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ అంశాలను ప్రస్తావించిన ఆయన.. తాజాగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాల్సిన పరిహారంపై లేఖ రాశారు.
బాధితుల్లో ఎక్కువగా రోజువారీ కూలీలు, చిరు వ్యాపారులే ఉన్నారని వారిని ఆదుకోవాలన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 80 శాతం మంది బాధితులకు మేలు చేసేలా రూ.1100 కోట్లు విడుదల చేస్తామని ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చిన విషయాన్ని రఘురామ గుర్తు చేశారు.
మీరు ఇచ్చిన హామీ ఇదిగో… అపుడు మాట తప్పారని చంద్రబాబును విమర్శించి ఇపుడు నువ్వేం చేస్తున్నావు జగన్ అంటూ అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలంటూ.. ఉద్యమిస్తున్న నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ రాసిన తాజా లేఖ సీఎం జగన్కు చుక్కలు చూపించడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.