మంత్రి పదవులు దక్కకపోవడంతో గతంలో బాలినేని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు బాహాటంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కడం సంచలనం రేపింది. బాలినేని మూడు జిల్లాలకు ఇన్ఛార్జి అని, అలాంటి వ్యక్తికి స్థానిక నేతలు అండగా ఉండకుండా అడ్డంకిగా మారడం ఏమిటని, బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని కోటంరెడ్డి గతంలో వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.
ఇక, తన నియోజకవర్గంలో మురుగునీటి కాలువ సమస్యపై కోటంరెడ్డి చేపట్టిన వినూత్న నిరసన కార్యక్రమం వైరల్ గా మారింది. స్వయంగా కాలువలోకి దిగి కోటం రెడ్డి నిరసన తెలుపడంతో వైసీపీ పరువు పోయింది. ఇలా నిత్యం తన వ్యాఖ్యలు, చర్యలతో వార్తల్లో నిలిచే కోటం రెడ్డి..తాజాగా తన నియోజకవర్గంలో పెన్షన్ల కోతపై బాహాటంగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోటంరెడ్డి విమర్శలు చేశారు. నెల్లూరు రూరల్లో 2,700 పెన్షన్లు తొలగించారని కోటంరెడ్డి అభ్యంతరం తెలిపారు. తన నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవని, సీఎం ఆదేశించినా దర్గా అభివృద్ధికి నిధులు ఇవ్వలేదని ఐఏఎస్ అధికారి రావత్పైనా కోటంరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా సీఎంవో నుంచి కోటంరెడ్డికి పిలుపు వెళ్లినట్లు తెలుస్తోంది. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కోటంరెడ్డితోపాటు జగన్ ను కలిసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల కోటం రెడ్డి విమర్శలు దుమారం రేపడంతో వాటిపై వివరణ ఇచ్చేందుకు కోటం రెడ్డి, బాలినేని వచ్చారని తెలుస్తోంది. ఈ సందర్భంగా కోటం రెడ్డికి జగన్ క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.