సీఎం జగన్ పై ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ ను జైలుకు పంపాలని, బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన రఘురామ…ఇదంతా జగన్ మంచి కోసమే అంటూ వ్యాఖ్యానించడం వైసీపీ నేతలకు మింగుడుపడడం లేదు. మరోవైపు జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ వేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. పిటిషన్ ప్రొసీడింగ్స్ సరిగా లేవని, సరైన డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రఘురామకు బెదిరింపులు వస్తున్నాయి.
దీంతో, తనకు వస్తున్న బెదిరింపులపై రఘురామ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా జగన్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జగన్ ను రాముడని అనుకుంటున్నాని, రావణుడని కొందరు అనుకుంటున్నారని చెప్పారు. జగన్ రాముడో.. రావణుడో తేలేవరకు ఏపీలో అడుగుపెట్టబోనని ఆయన ఛాలెంజ్ చేశారు. జగన్ ను టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు నారాయణుడితో పోల్చడం దురదృష్టకరమని షాకింగ్ కామెంట్లు చేశారు.
బాబాయి వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లవుతున్నా నేరస్థులను పట్టుకోలేనివారు నారాయణుడా? అని రఘురామ ఎద్దేవా చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి తనను తానే కాపాడుకోవాలని అన్నారు. ఒక క్రిస్టియన్ ముఖ్యమంత్రిని నారాయణుడుగా కీర్తించడం హిందు ధర్మంపై జరుగుతున్న దాడిగా భావిస్తున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాను కనబడడం లేదంటూ వైసీపీ నేతలు పోస్టర్లు వేస్తానంటున్నారని, తన గురించి ఎన్ని పోస్టర్లు వేసినా, ఏం చేసినా రాష్ట్రానికి రానని తెగేసి చెప్పారు. తాను సర్పయాగం వంటి మహాయజ్ఞం చేపట్టానని, అది పూర్తయ్యే వరకు ఏపీకి రానని అన్నారు. తనపై దాడి చేయాలని చూస్తే తన వెనుక ప్రధాని మోడీ ఉన్నారని, త్వరలో ప్రధానమంత్రికి లేఖ రాసి.. కలుస్తానని రఘురామ అన్నారు.
సంక్షేమ పథకాల అమలుకు రూ.1500 కోట్లు కావాలని, అందుకోసం విశాఖలో భూములు అమ్మాలని చూస్తున్నారని.. త్వరలో రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారని మండిపడ్డారు. జగన్ తిరుపతి ఎన్నికల ప్రచారానికి వెళ్లకుంటే బావుంటుందన్న రఘురామ…తిరుపతిలో వైసీపీ 2 లక్షల మెజారిటీతో గెలుస్తుందని జోస్యం చెప్పారు.