నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సొంత పార్టీపైనే కోటంరెడ్డి ఈ స్థాయిలో ఆరోపణలు చేయడంతో వైసిపి అధిష్టానం ఇరకాటంలో పడింది. దీంతో, ఈ వ్యవహారంపై సీఎం జగన్ కూడా సీరియస్ అయి విచారణకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి వ్యాఖ్యలపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సజ్జల రామకృష్ణారెడ్డి, హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుతో జగన్ భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఈ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను రంగంలోకి దిగాల్సిందిగా జగన్ ఆదేశించారట. కోటంరెడ్డి ఆడియో రికార్డు వివరాలను సేకరించేందుకు అధికారులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఆ ఆడియో కాల్ లో శ్రీధర్ రెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారణ జరిపేందుకు కూడా అధికారులు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇప్పటికే రామశివారెడ్డి ఫోన్ డేటాను అధికారులు విశ్లేషణ జరుపుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, తనకు ప్రాణహాని ఉందంటూ, తన ఫోన్ కూడా టాప్ చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే ఆనం చేసిన వ్యాఖ్యలపై కూడా జగన్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆనం అసంతృప్తికి గల కారణాలను తెలుసుకునేందుకు, ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పరిశోధన జరిపేందుకు కూడా జగన్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వైసీపీ అధినేత జగన్ ను ఇరకాటంలో పడేసినట్లు చెప్పవచ్చు.