రీల్ సీన్ కు ఏ మాత్రం తీసిపోని రీతిలో రియల్ సీన్ ఉంది. మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపిస్తూ తాజాగా భారీ ఎత్తున ఆందోళన చేయడం సంచలనంగా మారింది. అన్నింటికి మించి.. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ నోటి నుంచి వచ్చిన సంచలన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. ఇంతకూ ఆమె చేసిన ఆరోపణలు ఎవరి మీదనో కాదు.. ఏకంగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బ్రిజ్ భూషణ్ పై సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచ చాంపియన్ షిప్ పతక విజేత కమ్ ఒలింపియన్ అయిన వినేశ్ తాజాగా ఆవేదన వ్యక్తం చేయటం షాకింగ్ గా మారింది.
ఎంతో కాలంగా సాగుతున్న వీరి ఆగడాలకు చెక్ చెప్పాల్సిన అవసరం ఉందంటూ తనతో పాటు మరికొందరు మహిళా రెజ్లర్లతో కలిసి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె నిరసన దీక్ష చేపట్టారు. తాజాగా జరిపిన ధర్నాలో పలువురు స్టార్ రెజ్లర్లు బయటకు రావటం విశేషం. వారిలో.. ఒలింపిక్ కాంస్య పతక విజేతలు సాక్షి మాలిక్.. భజ్రంగ్ పూనియాతో పాటు ప్రపంచ చాంపియన్షిప్ పతక విజేతలు సరితా మోర్, సంగీతా ఫొగట్, సత్యవర్త్ మాలిక్, జితేందర్, సుమిత్ మాలిక్ సహా 30 మంది టాప్ రెజ్లర్లు ఉండటం గమనార్హం.
లైంగిక వేధింపులపై ప్రధాని నరేంద్ర మోడీ.. హోం మంత్రి అమిత్ షాలు వెంటనే కలుగజేసుకొని తక్షణమే బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాలంటూ వారు మూకుమ్మడి డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. గతంలో తాను ఇచ్చిన ఫిర్యాదుపై వేధింపులు మొదలు కావటంతో ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నట్లుగా వినేశ్ మీడియా ముందు కంటతడి పెట్టుకోవటం ఇప్పుడు సంచలనంగా మారింది. బ్రిజేశ్ తో పాటు మరికొందరు కోచ్ లు కూడా లైంగికంగా వేధిస్తున్నారని వాపోయారు. వేదింపులకు గురైన వారిలో పది నుంచి పన్నెండు మంది మహిళా రెజ్లర్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఈ ఉదంతం పెను సంచలనంగా మారింది. ఎలాంటి అవినీతిని..అక్రమాలను అవకాశం ఇవ్వకుండా మోడీ పాలన సాగుతుంటే.. ఈ తాజా ఆరోపణల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతటి దరిద్రం జరుగుతున్నా.. మోడీ సర్కారు మౌనంగా ఎందుకు ఉంది. ప్రపంచ స్థాయి రెజ్లర్లు రోడ్ల మీదకు వచ్చి తమకు న్యాయం జరిగేలా చేయాలంటున్న వైనం మోడీ సర్కారు వైఫల్యానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రధాని మోడీ రియాక్టు అవుతారా? లేదా? అన్నది చూడాలి.