వైఎస్ వివేకా హత్య కేసులో రోజుకో ట్విస్ట్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయం అనుకుంటున్న తరుణంలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. మరోవైపు, అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
అంతే కాకుండా ఈ కేసులో స్వయంగా సునీత వాదనలు వినిపించడం సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీంకోర్టులో వైఎస్ సునీతకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ తరఫు న్యాయవాదులకు సునీత తరపు న్యాయవాది సాయం చేసేందుకు సీబీఐ కోర్టు శుక్రవారం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రకారం సునీత వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీబీఐ కోర్టు ఆ విధంగా ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ కోర్టు తాజా ఆదేశాలతో సునీత లేదా ఆమె తరపు న్యాయవాదులు సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కలిసి వాదనలు వినిపించే అవకాశం ఉంది. అయితే, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని సునీతను సీబీఐ కోర్టు ఆదేశించింది.
మరోవైపు, ఈ కేసులో ఆరుగురు నిందితులకు సీబీఐ కోర్టు రిమాండ్ పొడిగించింది జూన్ 30 వరకు రిమాండ్ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్ 30 కి వాయిదా వేసింది. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ ను పొడిగించింది.