అసెంబ్లీలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. తుచ్ఛ రాజకీయాల కోసం వైసీపీ నేతలు ఇంతలా దిగజారడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, ఈ ఘటన నేపథ్యంలో చంద్రబాబుకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఎన్నారైలు సంఘీభావం తెలుపుతున్నారు.
40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 71 ఏళ్ల వయసులో కంటతడి పెట్టేలా వ్యాఖ్యానించడంపై పలువురు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు, చంద్రబాబుకు అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత మైత్రేయన్ కూడా ఫోన్ చేసి పరామర్శించారు.
1984 నుంచి ఎన్టీఆర్ కుటుంబంతో మైత్రేయన్కు సత్సంబంధాలున్న నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించినట్లు మైత్రేయన్ ట్వీట్ చేశారు. అసెంబ్లీలో సభ్యులనరు వ్యక్తిగతంగా దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైత్రేయన్ ట్వీట్ లో తెలిపారు. ఇక, చంద్రబాబుకు సంఘీభావంగా నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆ వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే.