టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్ర షూటింగ్ లో కొద్ది నెలలుగా బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు 27న దేవర ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇటీవల ఆ చిత్ర షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో తారక్ రిలాక్స్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడుపి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకున్నాడు తారక్. తన తల్లి సొంతూరు కుందపురకు వచ్చానని, ఇక్కడకు తనను తీసుకువచ్చి కృష్ణుడి దర్శనం చేయించాలన్న తన తల్లి చిరకాల కోరిక ఈ రోజు నెరవేరిందని చెప్పాడు తారక్.
అంతేకాదు, సెప్టెంబర్ 2న తన తల్లి పుట్టిన రోజుకు ముందు ఆమె చిరకాల కోరిక నెరవేర్చడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తారక్ చెప్పాడు. ఆమెకు ఇంతకన్నా గొప్ప బహుమతి తానివ్వలేనని అన్నాడు. ఈ కల నెరవేరేందుకు సినీ నిర్మాత, హొంబలే గ్రూప్ వ్యవస్థాపకుడు విజయ్ కిరగండూర్ సాయం చేశారని ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు తారక్. ఇక, తన ఆప్త మిత్రుడు రిషబ్ శెట్టి (కాంతార ఫేమ్) తమతో ఉండటం ఈ సంతోష సమయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని చెప్పాడు. తన ప్రియ మిత్రుడు, దర్శకుడు ప్రశాంత్ నీల్ తనతో ఉండడం మరింత ప్రత్యేకమని చెప్పాడు. తన తల్లి, తన భార్య ప్రణతి, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ లతో కలిసి దిగిన ఫొటోలను ఎక్స్ వేదికగా తారక్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కన్నడలో తారక్ అనర్గళంగా మాట్లాడిన వీడియో వైరల్ గా మారింది.