మోడీ అంతర్జాతీయ నేతల్ని పొగిడే విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. కానీ, దేశంలోని ఇతర రాజకీయ పార్టీ అధినేతల్ని ఉద్దేశించి అంత త్వరగా పొగడరు. ఒకవేళ పొగిడినా అందులోనూ చాలా పొదుపును ప్రదర్శిస్తారు. అందుకు భిన్నంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మాత్రం మినహాయింపు ఇస్తూ సంచలన వ్యాఖ్య చేశారు.
తాజాగా ఎన్డీయే పక్షాలతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు మోడీ. ఇందులో ఎన్డీయే పక్షాల నేతలు మాట్లాడారు. అదే సమయంలో కూటమిలో ఎన్నికైన ఎంపీలంతా హాజరయ్యారు. వారందరిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సంచలన ప్రశంసలు చేశారు. ‘‘ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుపాను’’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఏపీలో దక్కిన విజయం అక్కడి ప్రజల ఆకాంక్షల్ని అద్దం పట్టిందన్న ఆయన.. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయాన్ని సాధించామన్నారు. ఈ సందర్భంగా పవన్ ను ప్రస్తావిస్తూ.. ప్రత్యేకంగా ఆయన్ను అభినందించారు. మోడీ లాంటి నేత నోటి నుంచి వచ్చిన ఈ మాటల్ని విన్న పవన్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
యుద్ధ ప్రాతిపదికన మోడీ వ్యాఖ్యను.. పవన్ కల్యాణ్ ఫోటోలతో కూడిన చిట్టి వీడియోల్ని పోస్టు చేస్తున్నారు. తాజాగా జరిగిన సమావేశంలో బీజేపీ లోక్ సభా పక్ష నేతగా మోడీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. నితిన్ గడ్కరీ ప్రతిపాదించగా.. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించాయి.