మొదటి వేవ్ వచ్చింది.. వణికించింది. సెకండ్ వేవ్ వచ్చి.. షేక్ చేసేసింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా.. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటివేళ.. మూడో వేవ్ అన్న మాట వినిపిస్తేనే భయపడిపోయే పరిస్థితి. మరో నెలలో థర్డ్ వేవ్ షురూ అవుతుందని కొందరు వినిపిస్తున్న అంచనాలు ఆగమాగం అయ్యేలా చేస్తున్నాయి. ఇలాంటి వేళ.. తెలుగు ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకునే విషయాన్ని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు. మరో రెండు నెలల్లో థర్డ్ వేవ్ షురూ అవుతుందన్న అంచనాల్ని ఆయన కొట్టివేస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబరు – అక్టోబరులో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొందరు చెబుతుంటే.. గడల మాత్రం.. డిసెంబరులో వస్తుందని చెబుతున్న మూడో వేవ్ వచ్చే అవకాశం లేదని చెప్పారు. ఒక వేళ వచ్చే ఏడాది జనవరి.. ఫిబ్రవరి మాసాల్లో వచ్చినా.. దాని తీవ్రత తక్కువేనని ఆయన పేర్కొన్నారు. మన దగ్గర రెండో దశలో డెల్టా వైరస్ వేరియంట్ ప్రభావం చూపించిందని తెలిపారు. ఈ వేరియంట్ తీవ్రత ప్రాశ్చాత్య దేశాల్లో బాగా కనిపిస్తోందన్నారు. సాధారణంగా వైరస్ ప్రభావం తర్వాత పుట్టుకొచ్చే కొత్త వైరస్ లు బలహీనంగా ఉంటాయని.. వాటి ప్రభావం పెద్దగా ఉండదని తెలిపారు.
ప్రజలు మాత్రం ఎప్పటిలానే కరోనా నిబంధనల్ని కచ్ఛితంగా పాటించాలన్న మాటను ఆయన చెప్పారు. ఇదంతా చూసినప్పుడు.. ఇంతకాలం భయపడుతున్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఇప్పటికి ముంచుకొస్తుందన్న భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పొచ్చు. మరి.. పలువురు నిపుణులు గడల శ్రీనివాస్ వ్యాఖ్యలకు భిన్నంగా ఎందుకు చెబుతున్నట్లు? మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఆయన మాటలు నిజమైతే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ లాంటి వార్తగా చెప్పక తప్పదు. ఆయన అంచనా ఎంమేర నిజమన్నది చూడాలి.