టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా వైసీపీలో చేరతారన్న ప్రచారం జరగడం…దానిని గంటా ఖండించడం జరుగుతోంది. అలా అని గంటా టీడీపీ కార్యక్రమాల్లోగానీ, అసెంబ్లీ సమావేశాల్లో గానీ, వైసీపీతో వాడీవేడీగా జరుగుతున్న మాటల యుద్ధంలో గానీ వేలు పెట్టలేదు.
మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు పలువురు విశాఖ వైసీపీ నేతలు గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకించడం వల్లే వైసీపీలో గంటా చేరిక ఆలస్యమవుతోందని టాక్. ఈ విషయం టీడీపీ నేతలకూ తెలియడంతో అటు టీడీపీలో ఇమడలేకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్నది మరో కారణం అని ప్రచారం జరుగుతోంది. ఆ సమయంలోనే విశాఖ స్టీల్ ప్రైవేటికరణ అంశం తెరపైకి రావడంతో సందట్లో సడేమియా అంటూ తన పదవికి గంటా రాజీనామా చేశారని ప్రచారం జరిగింది. ఇక, ప్రధానికి జగన్ లేఖ రాయడంపై ప్రశంసలు కురిపించి జగన్ ను పొగిడిన గంటా… ఆ తర్వాత కొన్నాళ్లకు మెల్లగా జగన్ ను కలిసి మెడలో వైసీపీ కండువా వేసుకొని వల్లభనేని వంశీ, కరణం బలరాంలా ఉండాలని ఫిక్సయ్యారని టాక్ వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అసలు గంటా దారెటు అని తెలుసుకునే చాన్స్ ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలకు వచ్చింది. ఉత్తరాంధ్ర పరిధిలోని 12 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో.. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో నేడు సమావేశం నిర్వహిస్తున్నట్టు గంటా సహా ఉత్తరాంధ్ర నేతలకు చంద్రబాబు సమాచారం ఇచ్చారు. దీంతో, ఈ రోజు భేటీలో గంటాను చంద్రబాబు వివరణ కోరతారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఇన్నాళ్ల సస్పెన్స్ ను కొనసాగిస్తూ గంటా …చంద్రబాబుకు షాకిచ్చారు.
తాను ఆ భేటీకి హాజరు కాలేకపోతున్నానని గంటా సమాచారం ఇచ్చారు. సాధ్యమైనంత త్వరలోనే చంద్రబాబును కలుస్తానని చెప్పారు. విశాఖలో తెలుగు దేశం పార్టీ పరిస్థితిపై చంద్రబాబుకు త్వరలోనే అభిప్రాయాలు తెలియజేస్తానని పార్టీ వర్గాలకు సమాచారమిచ్చారు. ఇన్నాళ్లూ పార్టీకి అంటీముట్టనట్లుగా ఉన్న గంటా..తాజాగా చంద్రబాబు నిర్వహిస్తున్న భేటీకి కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. గంటా తీరుపై చంద్రబాబు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.