మంత్రి పదవి నుంచి తప్పించి.. భూకబ్జా ఆరోపణలపై సీనియర్ నేత ఈటలపై విచారణ జరుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో తెలిసిందే.
గతంలో పలువురు నేతలపై జోరుగా ఆరోపణలు వెల్లువెత్తినప్పటికి చూసిచూడనట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఈటల విషయంలో మాత్రం అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. దీనికి ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పింది లేదు.
మంత్రి పదవిని తప్పించిన తర్వాత కూడా.. తన ఆర్థిక మూలాల్ని టార్గెట్ చేసేలా కేసీఆర్ సర్కారు నిర్ణయాలు ఉండటంతో.. ఆ ఇబ్బంది నుంచి బయటపడేందుకు వీలుగా బీజేపీలోకి చేరాలని ఈటల భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తన ఢిల్లీ పర్యటనలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు ఈటల. ఈ సందర్భంగా వారి మధ్య పలు ఆసక్తికకర అంశాలు చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు.
బీజేపీపై తనకున్న సందేహాల్ని వెల్లడించటమే కాదు.. తన అవసరాన్ని.. తనకున్న ఇబ్బందుల్ని కూడా ఏకరువు పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నడ్డా స్పందిస్తూ.. ఈటలను బీజేపీలోకి రావాలని.. ఆయనకు తాము అండగా ఉంటామన్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు కొత్త టెన్షన్ తెప్పించే మాటలు కొన్ని ఈటల నోటి నుంచి వచ్చినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ సర్కారు చేసిన తప్పులతో పాటు.. ఇప్పటివరకు బయటకు రాని అంశాల్ని కూడా ఆయన షేర్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు.. సీఎం కేసీఆర్ పైన టీఆర్ఎస్ మంత్రులతో పాటు.. పలువురు నేతలు కూడా గుర్రుగా ఉన్నారని.. వారంతా బీజేపీ వైపు చూస్తున్నట్లు చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు అనుగుణంగా తాను పని చేస్తానని ఈటల చెప్పినట్లుగా తెలుస్తోంది.
టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలు కొన్ని చర్చకు రావటంతో ఇప్పటివరకు బయటకు రాని ఇంటి గుట్టు బయటకు పొక్కిందన్న టెన్షన్ లో కేసీఆర్ ఉన్నట్లుగా చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.