తెలంగాణలో సీనియర్ పొలిటిషియన్లలో ఒకరైన ఈటల రాజేందర్ ను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్…కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ క్రమంలోనే భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈటలపై పలువురు టీఆర్ఎస్ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ముఖ్యంగా ఈటలపై మంత్రి గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో సంచలన విమర్శలు చేశారు. దీంతో, తెలంగాణ రాజకీయాల్లో ఈటల వర్సెస్ గంగుల వెర్బల్ వార్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా గంగుల కమలాకర్ కు ఈటల రాజేందర్ వార్నింగ్ ఇచ్చారు. ‘బిడ్డా గంగులా… అధికారం ఎవడికీ శాశ్వతం కాదనే విషయం గుర్తుంచుకో…2023 తర్వాత నువ్వుండవు’ అని హెచ్చరించారు. కరీంనగర్ సంపదను గంగుల విధ్వంసం చేశారని, జిల్లాను బొందలగడ్డగా మార్చారని ఈటల విరుచుకుపడ్డారు. పైరవీలు చేసుకుని గంగుల మంత్రి అయ్యారని, తాను అలా కాదని విమర్శించారు.
గంగుల వంటి వ్యక్తుల బెదిరింపులకు తాను భయపడనని, గంగుల ఎన్ని ట్యాక్సులు ఎగ్గొట్టారో, ఆయన కథేందో మొత్తం తనకు తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయటపెడతానని… 2023 తర్వాత గంగుల ఉండరని తీవ్ర హెచ్చరికలు చేశారు. తాను ఎంతో సంస్కారంతో వ్యవహరిస్తున్నానని… లేకపోతే మాడిమసైపోతారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ సహా తెలంగాణ ప్రజలను, వారి ఆత్మగౌరవాన్ని నాటి వైఎస్ఆర్ మొదలు నేటి వరకు ఎవరూ కొనలేరని…తన ప్రాణం ఉన్నంతవరకు హుజురాబాద్ ప్రజల మీద ఈగ కూడా వాలనివ్వనని చెప్పారు.