ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పేరు మొదటి నుంచి వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈడీ టార్గెట్ చేసింది. ఒంగోలులోని మాగుంట నివాసంతో పాటు ఢిల్లీలోని లోథీ రోడ్డులో ఉన్న మాగుంటకు చెందిన 95వ నెంబర్ బంగ్లాలో ఉదయం నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరుతోపాటు దేశవ్యాప్తంగా 40 చోట్ల 25 ఈడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.
ఢిల్లీలోని వైన్ షాపుల టెండర్లను మాగుంటకు చెందిన కంపెనీలు దక్కించుకున్నాయని ఆరోపణ వచ్చాయి. ఆల్రెడీ బ్లాక్ లిస్టులో ఉన్న మాగుంటకు చెందిన కంపెనీలకు లైసెన్స్ లు ఇవ్వడంపై కూడా ఈడీ ఫోకస్ చేసింది. ఇలా లైెసెన్స్ లు దక్కించుకునేందుకు మాగుంట భారీగా లంచాలు చెల్లించారని తెలుస్తోంది.ఈ కుంభకోణంలో ఎంపీ విజయ సాయిరెడ్డి, ఆయన అల్లుడు, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిలతోపాటు మరికొందరు వైసీపీ నేతల హస్తం కూడా ఉందని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈడీ సోదాల తర్వాత మరికొందరు బడా నేతల పేర్లు వెల్లడి కావచ్చని టాక్ వస్తోంది. మరోవైపు, ఈ స్కాంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు కూడా వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కవిత పీఏ ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. ఇక, తాజాగా నేటి సోదాల నేపథ్యంలో కవితకు కూడా ఈడీ నోటీసులిచ్చిందని ప్రచారం జరిగింది. అయితే, తనకు ఎలాంటి నోటీసులు రాలేదని కవిత క్లారిటీనిచ్చారు.
ఈడీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని, వాస్తవాన్ని వెల్లడించడం ద్వారా టీవీ ప్రేక్షకుల విలువైన సమయాన్ని ఆదా చేయాలనుకుంటున్నానని తెలిపారు. ఢిల్లీలో కూర్చుని దుష్ప్రచారం చేస్తున్న కొందరు వ్యక్తులు మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే కంటే వాస్తవాలనే ప్రచారం చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీడియా సంస్థలన్నింటినీ కవిత కోరారు.