కృషి ఉంటే మనుషులు రుషులవుతారు…మహా పురుషులవుతారు..అంటూ ‘అన్న ఎన్టీఆర్’ పాట చాలా పాపులర్.
చదువుపై ఆసక్తి..చదవాలి అనే పట్టుదల ఉంటే వయసుతో సంబంధం లేదని నిరూపించిన వారెందరో ఉన్నారు.
అమెరికాలో గతంలో నివసించిన ప్రవాసాంధ్రుడు డాక్టర్ నూకల సూర్యనారాయణ(ధనం) కూడా ఈ కోవలోకే వస్తారు.
తొమ్మిది పదుల వయసులో వియత్నాం యూనివర్సిటీ నుంచి పీహెచ్. డీ పట్టా పొంది ఔరా అనిపించారు.
వియత్నాం నేషనల్ యూనివర్సిటీ నుండి 91 ఏళ్ల వయసులో డాక్టర్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ఫిలాసఫీ(D.litt) చేసిన సూర్యనారాయణ ఎందరికో స్ఫూర్తిదాయకం.
1954లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత, పెట్రోలియం రిఫైనింగ్ ఇండస్ట్రీలోకి నూకల సూర్యనారాయణ అడుగుపెట్టారు.
4 దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాలలో పని చేశారు.
ఆపరేషన్స్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి హోదాలలో సమర్థవంతంగా పని చేశారు.
కెరీర్ నుంచి రిటైర్ అయిన తర్వాత 77 సంవత్సరాల వయసులో ఫిలాసఫీ సబ్జెక్ట్ లో చేరిన సూర్యనారాయణ 2011 నాటికి మాస్టర్స్ పూర్తి చేశారు.
“మానవ విలువలు, సంబంధాలు” అనే అంశంపై తత్వశాస్త్రంలో పరిశోధనను సూర్యనారాయణ కొనసాగించారు.
2015లో 81 సంవత్సరాల వయసులో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్డీ పొందారు.
ఈ పరిశోధనలో మానవ విలువల యొక్క ప్రధాన భావనను గుర్తించారు.
ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక మరియు సమకాలీన కాలాలను ఈ అధ్యయనంలో తెలుసుకున్నారు.
మానవ విలువ వ్యవస్థలకు సంబంధించి తత్వవేత్తల భావజాలాన్ని గుర్తించారు.
2023లో పీ.హెచ్ డీ చేసేందుకు వియత్నాం నేషనల్ యూనివర్సిటీని సూర్యనారాయణ సంప్రదించారు.
డి.లిట్ అవార్డు కోసం పరిశోధన చేయడానికి యూనివర్సిటీ సూర్యనారాయణను అనుమతించింది.
“నిర్ణయ వాదం మరియు స్వేచ్ఛా సంకల్పం: ఒక తాత్విక సమీక్ష’’ అనే అంశంపై పీహెచ్. డీ చేశారు.
నమ్మకాలు, నమ్మకాలు మరియు విభిన్న అభిప్రాయాలు, సామాజిక మరియు నైతిక బాధ్యతలు…ఈ భావనకు సంబంధించిన తత్వవేత్తల మధ్య వాదనలు మరియు ప్రతివాదాలను వివరంగా పరిశీలించారు.
వేదాంత దృక్పథాలు మరియు వివిధ మత విశ్వాసాలు ఈ వాదాన్ని ఎలా పరిష్కరించాయో లోతైన పరిశోధన చేశారు. సూర్యనారాయణ పరిశోధనకు కొన్ని కేస్ స్టడీస్ ఉపకరించాయి.
91 ఏళ్ల వయసులో 2024 డిసెంబరులో వియత్నాం నేషనల్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ అవార్డు అందుకున్నానని సూర్యనారాయణ చెప్పారు.
ఈ వయసులో పీహెచ్ డీ చేయడం సంతోషంగా, ఛాలెంజింగ్ గా ఉందన్నారు.
కెరీర్ పరంగా, పీహెచ్. డీలు, పరిశోధనల పరంగా ఇప్పటివరకు సాధించిన విజయాలతో సంతృప్తిగా ఉన్నానని సూర్యనారాయణ అన్నారు.
దేవుడు తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించాడని, తన శేష జీవితాన్ని దక్షిణ భారతదేశంలో ఓ సీనియర్ సిటిజెన్ కమ్యూనిటీలో సంతోషంగా జీవిస్తున్నానని చెప్పారు.