ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై కొద్దిరోజుల క్రితం పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీంతో, ప్రభుత్వ పెద్దలకు, సినీ ప్రముఖులకు మధ్య కొంత ప్రతిష్టంభన ఏర్పడింది. ఆ తర్వాత సీఎం జగన్ తో చిరంజీవి తదితరులు భేటీ కావడం…టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలపై కొంత వెసులుబాటు కల్గడంతో నిర్మాతలు కొంత ఊరట చెందారు. ఆ తర్వాత రిలీజైన ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ వంటి చిత్రాలకు రేట్లు పెంచుకున్నారు నిర్మాతలు.
అయితే, తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం వల్ల థియేటర్లో సినిమాలు చూడడం తగ్గించారని, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూశారని తమ్మారెడ్డి వంటి కొందరు దర్శకనిర్మాతలు అభిప్రాయపడ్డారు. దీంతో, కొందరు నిర్మాతలు టికెట్ రేట్లు పెంచకుండా ఉండేందుకు ప్రయత్నిస్తుండగా…మరికొందరు మాత్రం బడ్జెట్ ను బట్టి టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 27న విడుదల కాబోతోన్న ‘ఎఫ్-3’ సినిమా టికెట్ రేట్ల వ్యవహారం తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా టికెట్ ధరలు పెంచే అంశంపై నిర్మాత దిల్ రాజు స్పందించారు. తమ సినిమా టికెట్ రేట్లు పెంచడం లేదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలే ఫైనల్ అని దిల్ రాజు ప్రకటించారు. ప్రశాంతంగా ఫ్యామిలీతో కలిసి థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేయొచ్చంటూ దిల్ రాజు హామీ ఇచ్చారు. మామూలుగా అయితే, సినిమా రిలీజైన మొదటి వారం, పది రోజుల పాటు మల్టీప్లెక్స్ లో 150 రూపాయల టికెట్ ను 200 నుంచి 300 వరకు అమ్ముతున్నారు. సింగిల్ థియేటర్లో 50 నుంచి 75 రూపాయలు ఉండే టికెట్స్ ను 150 వరకు అమ్ముతున్నారు.
ఇక, వెంకటేష్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించి బ్లాక్ బస్టిర్ హిట్ గా నిలిచిన ‘ఎఫ్-2’ సినిమాకు సీక్వెల్ గా ‘ఎఫ్-3’ రాబోతోంది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్-3’ సినిమాలోనూ ‘ఎఫ్-2’లో కనిపించిన తారలే కనిపించనున్నారు. వీరితో పాటు సునీల్, సోనాల్ చౌహన్ లాంటి కొందరు యాడ్ అయ్యారు. ఇప్పటికే విడులైన ఈ చిత్ర ట్రైలర్ చిత్రంపై అంచనాలను మరింత పెంచింది.