ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ లెక్కల మాస్టారు సుకుమార్ ల కాంబోలో వచ్చిన ”పుష్ప:ది రైజ్” సినిమా దేశవ్యాప్తంగా ట్రెండ్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ”పుష్ప”…అటు బాలీవుడ్ లోనూ వంద కోట్లు కొల్లగొట్టి ఇది డబ్బింగ్ సినిమానా అన్న అనుమానం వచ్చేలా చేసింది. ఇక, పుష్పలో తగ్గేదేలే అన్న డైలాగ్…శ్రీవల్లి పాటకు బన్నీ వేసిన స్టెప్పు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. క్రికెటర్లు మొదలు పలువురు సెలబ్రిటీలు, యాంకర్ల వరకూ పుష్ప మేనియాకు ఫిదా అయ్యారు.
ఇక, ఇటీవల పుష్ప ఫివర్ యూపీ ఎన్నికలకూ పాకిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని శ్రీవల్లి పాటను యూపీ గొప్పదనాన్ని చాటిచెప్పేలా కాంగ్రెస్ పార్టీ మార్పులు చేసి ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప ఫివర్ కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ నూ తాకింది. తాజాగా ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పుష్ప సినిమా ప్రస్తావన తీసుకువ్చిన రాజ్ నాథ్…ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీని పుష్పతో పోల్చారు.
సీఎం పుష్కర్ కు పుష్పతో లింక్ పెట్టారు రాజ్ నాథ్ సింగ్. కొంతకాలంగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప చిత్రం పేరు వార్తల్లో వినిపిస్తోందన్న రాజ్ నాథ్ సింగ్…ఉత్తరాఖండ్ సీఎం పేరు కూడా పుష్కర్ అని చెప్పారు. అయితే, పుష్కర్ అన్నా పుష్ప అన్నా పువ్వు అని అర్థం వస్తుందని, అందుకని పుష్కర్ ను చూసి కాంగ్రెస్ నేతలు ఫ్లవర్ అనుకుంటున్నారని, కానీ, పుష్కర్ అంటే ఫ్లవర్ తో పాటు ఫైర్ కూడా అని పంచ్ డైలాగ్ చెప్పారు. అంతేకాదు, ఎన్నికల ప్రచారంలో పుష్కర్ తగ్గేదేలే అని…ఆగేదేలే అని రాజ్ నాథ్ చెప్పారు. రాజ్ నాథ్ సింగ్ తో రచ్చ చేయించిన ‘పుష్ప’ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు తెగ వాడేస్తున్నారు. రకరకాల మీమ్స్ తో కాంగ్రెస్ పై సెటైర్లు పేలుస్తున్నారు.