టాలీవుడ్లో గత నాలుగు రోజుల నుంచి జానీ మాస్టర్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనను లైంగికంగా వేధించాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అత్యాచారంతో పాటు శారీరకంగా, మానసికంగా గాయపరిచారని.. అవుట్డోర్ షూటింగుల్లో లైంగికంగా వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఇష్యూపై అటు పోలీసులు, ఇటు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్న విమెన్ ప్రొటెక్టివ్ సెల్ విచారణ కొనసాగిస్తున్నారు.
ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2) కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. పోక్సో కేసు కూడా నమోదు కావడంతో.. పరారీలో ఉన్న జానీ మాస్టర్ కోసం మూడు రోజుల నుంచి గాలిస్తున్నారు. ఫైనల్ గా ఈ రోజు రాజేంద్రనగర్ ఎస్వోటీ పోలీసుల బృందం ఆయనను బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జానీ మాస్టర్ ను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. అనంతరం నేరుగా ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.
ఇక జానీ మాస్టర్ అరెస్ట్ అయిన కొద్ది సేపటికే.. మెగా బ్రదర్, జనసేన కీలక నేత నాగబాబు ఓ ట్వీట్ చేసారు. `న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు` అని ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారో చెప్పిన కొటేషన్ ను నాగబాబు ట్వీట్ చేశారు. అయితే నాగబాబు ట్వీట్ పరోక్షంగా జానీ మాస్టర్ ను ఉద్ధేశించే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెగా ఫ్యామిలీతో జానీకి మంచి బాండింగ్ ఉంది. జనసేనలో కూడా జానీ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు లైంగిక ఆరోపణలు ఎదుర్కోవడంతో.. పార్టీకి దూరంగా ఉండమని జానీకి సూచించినట్లు తెలుస్తోంది.
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
:- Sir William Garrow— Naga Babu Konidela (@NagaBabuOffl) September 19, 2024