టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకానికి ముందు దాదాపు ఏడాదిపాటు హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. రేవంత్ నియామకాన్ని టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు బలంగా వ్యతిరేకించడంతో దాదాపు పది నెలల పాటు రేవంత్ నియామక ప్రకటన పెండింగ్ లో పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, ఎలాగోలా అసమ్మతి నేతలను బుజ్జగించిన కాంగ్రెస్ హైకమాండ్ చివరకు రేవంత్ ను నియమించింది. కానీ, అప్పటి నుంచి కూడా రేవంత్ ను చాలామంది సీనియర్ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇక, ఇటీవల పీసీసీ కమిటీల నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు రేవంత్ పై గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు తదితర నేతలు భేటీ అయ్యారు. ముందు నుంచి కాంగ్రెస్ ను నమ్ముకొని పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరిగిందని, కొత్త పీసీసీ కమిటీలలో టిడిపి నుంచి వచ్చిన 50 మందికి చోటు కల్పించాలని ఉత్తమ్ మండిపడ్డారు.
కొంతమందిని అవమానించడానికే కొత్త కమిటీలను ప్రకటించారని ఆయన విమర్శించారు. తాము పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండే వారమని, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలం తామేనని అన్నారు. తానే ఉండాలి.. తన వాళ్లే ఉండాలి అని తాము ఎప్పుడూ అనుకోలేదని, ఇది మంచి పద్ధతి కాదని, దీని గురించి త్వరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అసలు కాంగ్రెస్ నాయకులకు ..వలస వాదులకు వ్యత్యాసం వచ్చిందని, కాంగ్రెస్ లో టీడీపీ వాళ్లకు పదవులు వచ్చాయని మరో నేత భట్టి విక్రమార్క అన్నారు.
ఇక, విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భట్టి వెంటే ఉంటానని చెప్పారు. ముందు నుంచి రేవంత్ ను వ్యతిరేకిస్తున్న కోమటిరెడ్డి..కాంగ్రెస్ సీనియర్ల నిర్ణయానికి మద్దతు ప్రకటించారు. మరి, దీనిపై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.