ఏపీ సీఎం చంద్రబాబు అనూహ్యంగా మరోసారి అప్పులు-వడ్డీలు-రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పందించారు. సుదీర్ఘంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని, గత ప్రభుత్వ నిర్వాకంతో వడ్డీలు కట్టాల్సి వస్తోందని.. అందుకే.. పథకాల అమలు ఆలస్యమవుతోందని ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అయితే.. ఇప్పటికి ఇలా నాలుగు సార్లు చంద్రబాబు పథకాలపై స్పందించారు. ఏడుమాసాల కూటమి ప్రభుత్వ కాలంలో ఆయన ఇలా స్పందించడానికి.. తాజా స్పందనకు తేడా ఉంది. ఈ సారి కొంత లోతుగానే చంద్రబాబు ఆలోచన చేశారు. స్పందించారు. ఆయన ప్రతి వాక్యంలోనూ.. ఈ ఆవేదన, బాధ కనిపించింది.
మరి దీనికి కారణం ఏంటి? అనేది ప్రశ్న. గత ఆరు మాసాల కూటమి పాలనపై చంద్రబాబు ఐవీఆర్ ఎస్ సర్వే ద్వారా ప్రజల నుంచి సమాచారం సేకరించారు. దీనికి సంబంధించి వివిధ శాఖలు సంపూర్ణంగా సమాచారాన్ని అందించాయి. దీనిపై తాజాగా సోమవారం మధ్యాహ్నం ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్షించారు.
ప్రజలు ఇచ్చిన ఫీడ్ బ్యాక్‌లో ప్రధానంగా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ రూ.15000 చొప్పున ఇచ్చే మాతృవందనంపై ప్రజల్లో చర్చ జరుగుతున్న విషయాన్ని బాహాటంగానే వారు వెల్లడించారు. అదేసమయంలో ఏడాదికి రూ.20000 చొప్పున రైతులకు ఇచ్చే భరోసా నిధులపైనా అన్నదాతల నుంచి డిమాండ్లు పెరుగుతున్న విషయం కూడా ఐవీఆర్ ఎస్ సర్వేలో స్పష్టంగా తెలిసింది.
వీటికితోడు ఫీజు రీయింబర్స్ మెంటు నిధులు సహా.. మహిళలకు ఉచిత బస్సు పథకంపైనా వారి నుంచి సర్వేలో గట్టి డిమాండ్లే వినిపించాయి. ఆయా విషయాలను శాఖా కార్యదర్శులు ఏడు నివేదికల రూపంలో సీఎం చంద్రబాబు ముందు పెట్టారు. వీటిపై సుదీర్ఘంగానే చర్చించారు. ప్రజల్లో తలెత్తుతున్న డిమాండ్లపై చంద్రబాబు కూడా.. దృష్టి పెట్టారు. కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో బహుళ ఆర్థిక ప్రయోజనాలు అందించే ఈ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు హుటాహుటిన మీడియాతో భేటీ నిర్వహించారు. వాస్తవానికి సోమవారం నాటి షెడ్యూల్లో మీడియా మీటింగ్ లేదు. అయినా.. అప్పటికప్పుడు మీడియా మీటింగ్ పెట్టి.. ప్రజల నాడిపై చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదని.. అందుకే.. సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. మరి దీనిని ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో చూడాలి.