వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ – జనసేన పొత్తు సాగుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. విజయనగరంలోని నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లిలో భారీ ఎత్తున నిర్వహించి న ‘యువగళం’ ముగింపు సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఉమ్మడి పార్టీల కార్యాచరణను ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో టీడీపీ-జనసేన కలిసి నిర్వహించనున్న సభలను కూడా ప్రకటించా రు.
త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేస్తామన్న చంద్రబాబు.. అమరావతి, తిరుపతిలో సభలు నిర్వహి స్తామని వెల్లడించారు. అమరావతి లేదా తిరుపతి సభలో మేనిఫెస్టో ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే మహాశక్తి కార్యక్రమానికి శ్రీకారం చేపట్టామని, 20 లక్షల మందికి ఉపాధి కల్పన బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు.
నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల భృతి అందిస్తామన్నారు. ఇది ఉద్యోగం వచ్చే వరకు కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. అన్నదాత కార్యక్రమం ద్వారా రైతులకు ఆర్థికసాయం చేస్తామన్నారు. బీసీల కోసం రక్షణ చట్టం తీసుకువస్తామన్న చంద్రబాబు అగ్రవర్ణాల పేదలను కూడా అన్ని విధాలా.. ఆర్థికంగా ఆదుకుంటామన్నారు. వచ్చేది కురుక్షేత్ర యుద్ధంగా చంద్రబాబు అభివర్ణించారు. ఈ యుద్ధంలో వైసీపీ ఓటమి ఖాయమని వెల్లడించారు.
జగన్‌పైనే గురి!
దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవని.. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో ఎక్కడా పాదయాత్రపై దండయాత్ర చేసిన సందర్భాలు లేవు. తొలిసారి సైకో జగన్ పాలనలో దండయాత్రలు చూశా. పోలీసులను అడ్డంపెట్టుకుని ఇబ్బందులు పెట్టారు. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటాం“ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువగళం జనగళంగా మారి ప్రజాగర్జనకు నాంది పలికిందన్నారు. యువతకు టీడీపీ- జనసేన అండగా ఉంటాయని తెలిపారు. “మాకు రాజకీయ వ్యతిరేకత తప్ప వ్యక్తిగత వ్యతిరేకత ఉండదు. వైసీపీ నేతల కబ్జాలో ఉత్తరాంధ్ర పూర్తిగా నలిగిపోతోంది. ఉత్తరాంధ్రలో అభివృద్ధి ఆగింది.. కబ్జాలు పెరిగాయి. వైసీపీ నేతలు మెడపై కత్తిపెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు“ అని అన్నారు.