ఏపీలో ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకల వ్యవహారం కొద్ది రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈరోజు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు ఆ తర్వాత ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ సమావేశమై ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారంపై చర్చించారు. ఏపీలో ఓట్ల నమోదులో అక్రమాలు జరుగుతున్నాయని…సిఇసి, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, ఇతర రాష్ట్రాల ఐఏఎస్ లు ఏపీలో పర్యటించి ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తాను కోరినట్లు చంద్రబాబు మీడియాకు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేసినట్టుగా తెలిపారు. ఒక పార్టీకి చెందిన ఓట్ల తొలగింపు కోసం అధికార పార్టీ ప్రయత్నిస్తుందని సాక్షాధారాలతో సహా ఎన్నోసార్లు ఈ వ్యవహారంపై పోరాడామని చంద్రబాబు అన్నారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీల గుర్తింపును రద్దు చేసే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని చంద్రబాబు తెలిపారు. గతంలో జరిగిన లోక్ సభ స్థానం ఉప ఎన్నిక సందర్భంగా భారీ సంఖ్యలో బోగస్ ఓటర్ కార్డులు పట్టుకున్నా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోలేదని వాపోయారు.
ఇక, ఏపీలో వాలంటీర్లను బిఎల్ఓ, ఎన్నికల విధులకు కేటాయించడంపై కూడా చంద్రబాబు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను చేర్చడం, టిడిపికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించడం, చనిపోయిన వారిని జాబితాలో చేర్చడం ఇలా అవకతవకలకు పాల్పడుతున్నారని, ఈ రకంగా మొత్తం 15 లక్షల ఓట్లు తారుమారయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలకు ముందే ఈ అక్రమాలను సరిదిద్దాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశానని చంద్రబాబు అన్నారు.
ఇక, ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడా చంద్రబాబు భేటీ అయ్యారు. దొంగ ఓట్ల వ్యవహారంపై నడ్డాతో చంద్రబాబు చర్చించారు. ఆ సమయంలో చంద్రబాబు వెంట వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుతో పాటు సీఎం రమేష్, దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు ఉన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల చేయడం తెలుగు వారందరూ గర్వించదగ్గ క్షణమని చంద్రబాబు ప్రశంసించారు. ఈ సందర్భంగా నాణాన్ని విడుదల చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.