ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి….ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి….విశ్రమించవద్దు ఏ క్షణం…విస్మరించవద్దు నిర్ణయం…అప్పుడే నీ జయం నిశ్చయంరా…పట్టుదల చిత్రంలోని ఈ పాట ఎందరికో స్ఫూర్తి దాయకం…జీవితంలో పట్టుదలో పోరాడితే విజయం మనదేనని చాటి చెప్పే ఈ పాట ఎందరినో కదిలించింది…మరెందరినో ముందుకు నడిపించింది. అయితే, ఈ పాటలోని ప్రతి పదం అతికినట్టు సరిపోయేలా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని విజయాలు సాధిస్తున్న ఎదురులేని మనిషొకరున్నారు.
మొక్కవోని దీక్షతో అడ్డంకులు, అవరోధాలనే ఆయుధాలుగా మలుచుకొని ముందుకు సాగితే ఓటమి కూడా మనల్ని చూసి పారిపోతుదంని నిరూపించిన వ్యక్తి ఆయన. నీరసించి నిలిచిపోతే నిమిషమైన మనది కాదని…బ్రతుకు అంటే నిత్య ఘర్షణ అని నమ్మిన వ్యక్తి ఆయన. దేహముంది ప్రాణముంది నెత్తురుంది….సత్తువుంది ఇంతకన్న సైన్యం ఏం కావాలి..అని తనను తాను ప్రశ్నించుకున్న గొప్ప దార్శనీకుడాయన.
అతడే ఒక సైన్యంగా నాలుగు దశాబ్దాలుగా అలుపెరుగని రాజకీయ ప్రస్థానాన్ని అవలీలగా పూర్తి చేసుకున్న ఒకే ఒక్కడు…..ఆయనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రజల కోసం ఇటు వ్యక్తిగత జీవితంలో…అటు రాజకీయ జీవితంలో ఎన్నో త్యాగాలను చేసిన చంద్రబాబు ఎందరికో ఆదర్శప్రాయం. సరిగ్గా 30 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తొలిసారి ఈ రోజు చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నమస్తే ఆంధ్ర పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
సాధారణంగా రాజకీయ నాయకులు అధికారంలో ఉంటే ఒకలాగా, ప్రతిపక్షలో ఉంటే ఒకలాగా వ్యవహరిస్తుంటారు. కానీ, చంద్రబాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పడూ ఆయనది ప్రజాపక్షమే. ప్రజాసేవే జీవితపరమావధిగా స్థిత ప్రజ్ఞతతో ఒక ప్రత్యేక జీవన సరళిని అనుసరిస్తున్న జననేత చంద్రబాబు. గెలుపోటములనూ ఏనాడు లెక్క చేయని ధీరుడు ఆయన.
మనదేశ రాజకీయ రంగంలో సుస్పష్టమైన ప్రణాళిక,దార్శనికత, ముందుచూపు కలిగిన అతి కొద్ది మంది నాయకుల్లో చంద్రబాబు ఒకరు. విజన్ 2020 పేరుతో నేడు ఇరు తెలుగు రాష్ట్రాలు సాధించబోయే అభివృద్ధికి ఏనాడో బీజాలు వేసిన రాజకీయ మేధావి చంద్రబాబు. ఇప్పుడు విజన్ 2047 పేరుతో వికసితాంధ్రప్రదేశ్ నినాదంతో చంద్రబాబు ముందుకు వెళుతున్నారు. ప్రపంచ ఐటీ పటంలో హైదరాబాద్ ను నిలిపిన ఘనత ఆయనదే. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఉన్న ప్రతి నలుగురిలో ఒకరు తెలుగువారే కావడం చంద్రబాబు చలవే. 1956 నుండి 2024 వరకు రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ పొలిటిషియన్ చంద్రబాబు.
వెన్ను చూపని ధీరత్వమే 74ఏళ్ల వయస్సులోనూ అలుపెరుగని యోధుడిలా చంద్రబాబును ముందుకు నడుపుతోంది. ప్రజా సంక్షేమంకోసం, రాష్ట్రాభివృద్ధికోసం చంద్రబాబు చేసిన కృషిని, సేవలు వెలకట్టలేనివి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్ల పరిపాలనలో, విభజిత నవ్యాంధ్రలో 5 ఏళ్ల పాలనలోగానీ చంద్రబాబుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారతదేశ చిత్రపటంలో ఏపీని అగ్రగామిగా నిలిపిన ఘనత చంద్రబాబుదే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారిగా ప్రమాణస్వీకారం చేసి నేటికి (సెప్టెంబర్ 1) 30 ఏళ్లు పూర్తయింది.