తన తనయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ పై ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. అతి తక్కువ కాలంలో 52 లక్షల టీడీపీ సభ్యత్వాలు నమోదు చేయించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను చంద్రబాబు అభినందించారు. దాంతోపాటు సభ్యత్వ నమోదులో తొలి 10 స్థానాల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు అభినందించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి గుర్తించామని అన్నారు.
పొలిటికల్ గవర్నెన్స్ విధానం తెచ్చామని, పార్టీని ప్రభుత్వంతో అనుసంధానించే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. త్వరలో సాగునీటి సంఘాలు, సహకార సంఘాల ఎన్నికలున్నాయని, కూటమి అభ్యర్థులు ఆ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేలా నాయకులు, కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కార్యకర్తలను ఆర్థికంగా, రాజకీయంగా పైకి తెస్తామని హామీ ఇచ్చారు.
రోడ్ల మరమ్మతులకు రూ.1,400 కోట్లు మంజూరు చేశామని, సంక్రాంతి నాటికి రోడ్లపై గుంతలు లేకుండా చూస్తామని హామీనిచ్చారు. యువతకు 20లక్షల ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజల కోసమే రాజకీయం చేస్తున్నామని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని తప్పులు చేసేవారిని చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూతగాదాలు, భూసమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు.