‘‘టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? 2014 రిజల్ట్ ను రిపీట్ చేయాలంటే చంద్రబాబు, పవన్ కలిసి పోరాడాల్సిందే..జగన్ ను ఢీకొట్టాలంటే ఈ రెండు పార్టీలు జత కట్టాల్సిందే…కానీ, బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు…మరోవైపు, టీడీపీతో పొత్తుకు బీజేపీ ప్రయత్నిస్తోంది…అయినా, ఏపీలో ప్రభావం లేని బీజేపీతో మనకెందుకు…చంద్రబాబు, పవన్ కలిస్తే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం..మరోసారి చంద్రబాబు సీఎం కావడం ఖాయం…
ఇంకోసారి జగన్ కు చాన్స్ ఇస్తే ఏపీ పరిస్థితి ఇంకా దారుణంగా మారిపోతుంది…చంద్రబాబు, పవన్ కూర్చొని పొత్తులపై మాట్లాడుకొని త్వరగా తేలిస్తే బాగుంటుంది…ముందస్తు ఎన్నికలు వచ్చినా ఇబ్బంది లేకుండా చాలా టైం ఉంటుంది…’’ గత కొంతకాలంగా ఏపీలోని ఏ రచ్చబండ దగ్గర చూసినా… ఏ ఇద్దరు జనసేన, టీడీపీ కార్యకర్తలు రాజకీయాల గురించి టీ స్టాళ్ల దగ్గర, బడ్డీ కొట్ల దగ్గర మాట్లాడుకుంటున్నా ఇదే చర్చ.
ఈ చర్చకు తెరదించుతూ తాజాగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. వైసీపీ నేతలకు వారి భాషలోనే బూతులతో వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్…ఆ తర్వాత చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడంలో జాప్యం చేస్తోందని, ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారుతోందంటూ బీజేపీతో పొత్తుపై పవన్ షాకింగ్ కామెంట్లు చేసిన కాసేపటికే పవన్ తో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంగళగిరిలో సమావేశం తరువాత విజయవాడలోని నోవోటెల్ హోటల్ వెళ్లిన పవన్ ను చంద్రబాబు కలిశారు. హోటల్ కు వచ్చిన చంద్రబాబును పవన్ సాదరంగా ఆహ్వానించారు. ఆ తర్వాత ఈ ఇద్దరు నేతలు విశాఖలో జరిగిన పరిణామాలు, పోలీసుల తీరుపై చర్చించారు. విశాక పరిణామాల నేపథ్యంలో పవన్ కు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు వచ్చిన సమయంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కమిటీ సభ్యుడు నాగబాబు కూడా ఉన్నారు.
పవన్ తోపాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్‌ను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. పవన్ కు పుష్పగుచ్ఛం అందజేసిన చంద్రబాబు..పలు కీలక విషయాలను ఆయనతో చర్చించారు. రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం, సీట్ల పంపకం వంటి కీలక విషయాలపై పవన్ తో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. సోమవారం నాడు పవన్ తో సోము వీర్రాజు భేటీ అయి కీలక చర్చలు జరిపారని, కానీ, ఆ చర్చలు విఫలం కావడంతోనే బీజేపీతో పవన్ కటీఫ్ చేసుకొని టీడీపీతో పొత్తుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నారని తెలుస్తోంది. రేపో మాపో టీడీపీ-జనసేనల పొత్తుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది.