జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జడ్జి జస్టిస్ ఉత్తమ్ ఆనంద్ హత్యోదంతం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. పట్టపగలే జడ్జిని ఆటోతో గుద్ది యాక్సిడెంట్ లా చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే, ఆ ఘటన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. జడ్జి హత్యపై న్యాయమూర్తులు, న్యాయవాదులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గ్యాంగ్స్టర్లు, హై ప్రొఫైల్ వ్యక్తులు నిందితులుగా ఉన్న కేసులు అనేకమని, వాట్సాప్, ఎస్ఎంఎస్ మెసెజ్‌లను పంపిస్తూ న్యాయమూర్తులను కొందరు మానసికంగా వేధిస్తూ, బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వేధింపులు, బెదిరింపులపై జడ్జిలు ఫిర్యాదులు చేసినప్పటికీ సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఏమీ చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు తాను చేయాల్సి రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతికూల తీర్పు వచ్చినపుడు న్యాయమూర్తులను అపఖ్యాతిపాలు చేసే కొత్త ధోరణి వచ్చిందని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జిలు ఇచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదికలను సమర్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.