టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసిన తర్వాత టికెట్ రాని కొందరు నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. టికెట్ ఆశించి భంగబడ్డ కొందరు టీడీపీ అభ్యర్థులు ఆ పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు జనసేన నేతలు పవన్ కళ్యాణ్ తో భేటీకి ప్రయత్నిస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు, వారి అనుచరులు చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యడు బుద్ధా వెంకన్న తన అనుచరులు, ఆత్మీయులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తన టికెట్ వ్యవహారంపై బుద్ధా వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ కావాలని చంద్రబాబును రిక్వెస్ట్ చేయడంలో తప్పు లేదని. కానీ డిమాండ్ చేయడం సరికాదని బుద్ధా అభిప్రాయపడ్డారు. ఇది, టికెట్ కోసం బల ప్రదర్శన చేస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం కాదని, టికెట్ రాలేదని ఎలా పడితే అలా మాట్లాడే నాయకుడిని తాను కాదని బుద్ధా అన్నారు. అలా మాట్లాడితే కొడాలి నాని, కేశినేని నాని, వల్లభనేని వంశీలకు తనకు తేడా ఏంటి అని ప్రశ్నించారు.
తాను చంద్రబాబుకు హనుమంతుడి వంటి వాడినని, టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఆయన తన గుండెల్లో ఉంటారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నిర్ణయాన్ని శిరసావహిస్తానని, టికెట్ ఇచ్చిన వారికి 100కు లక్ష శాతం మద్దతుగా ఉంటానని అన్నారు. చంద్రబాబుపై ప్రేమతో ఈ సమావేశం ఏర్పాటు చేశామని, ఆవేదనతో కాదని, రెండింటికీ తేడా ఉందని అన్నారు.