పార్టీ మారిన కుకట్ పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ప్రతిపక్ష నేతకు ఇవ్వాల్సిన పీఎసీ పదవి ఎలా ఇస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించటమే కాదు.. సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తానంటూ చేసిన సవాలు ఎంతటి రచ్చకు కారణమైందన్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళ్లకుండా కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకోగా.. గాంధీ మాత్రం కౌశిక్ ఇంటికి రావటంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి ఇంటి ముందు ఉన్న పూలకుండీలను ధ్వంసం చేయటం.. గేట్లు విరగ్గొట్టటం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే సమయంలో టమోటాలు.. గుడ్లతో గాంధీ అనుచరులు దాడికి పాల్పడగా.. కౌశిక్ రెడ్డి వర్గీయులు ప్రతిదాడికి పాల్పడ్డారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణంచోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులు గాంధీని అదుపులోకి తీసుకున్నారు. ఇంటి పైనుంచి తమపై కౌశిక్ రెడ్డి సతీమణి పూలకుండీలను పడేశారంటూ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగానే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా ఆమె పేర్కొన్నారు.
ఈ మొత్తం ఎపిసోడ్ పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. తన ఇంటిపైకి గాంధీ అనుచరులు దాడి చేయటంపై స్పందించిన అతను.. ఆంధ్ర.. తెలంగాణ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు.బతకటానికి వచ్చిన ఆంధ్రోళ్లు తెలంగాణ బిడ్డలపై దాడి చేస్తే ఊరుకునేది లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పౌరుషం ఏమిటో శుక్రవారం చూపిస్తామంటూహెచ్చరికలు జారీచేవారు.
నాలుగేళ్ల తర్వాత కేసీఆర్ అధికారంలోకి రావటం ఖాయమని.. అప్పుడు నీ భరతం పడతామన్న కౌశిక్ రెడ్డి.. ‘ఈ రోజు దాడి చేసిన ప్రతి ఒక్కరి భరతం పడతాం. సినిమా చూపిస్తా’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్లో తప్పు లేదన్న వాదనను వినిపించగా.. మరికొందరు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నుంచి బీఆర్ఎస్ లోకి తీసుకొని.. టికెట్ ఇచ్చినప్పుడు కనిపించని అరికపూడి గాంధీ మూలాలు.. ఈ రోజున కౌశిక్ రెడ్డి ఎలా తీస్తారంటూ మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూడటంలో అర్థం లేదన్న వాదనను వినిపిస్తున్నారు. ఇలాంటి తీరు మంచిది కాదంటున్నారు.