‘చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరం. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పని చేశారు. ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందిస్తాం. అలాంటి అక్షరయోధుడికి భారతరత్న సాధించడం మనందరి బాధ్యత’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
రామోజీరావు వ్యక్తి కాదు ఆయనో వ్యవస్థ. ఎంచుకున్న ప్రతి రంగంలో ఆయన నెంబర్‌వన్‌గా ఎదిగారు. నీతి, నిజాయతీకి ఆయన ప్రతిరూపం. ఏ పనిచేసినా ఎప్పుడూ ప్రజాహితం కోరుకునే వారు అని చంద్రబాబు అన్నారు.
మీడియా రంగంలో రామోజీరావు చేసిన కృషికి అనేక అవార్డులు వచ్చాయి. మార్గదర్శిని దెబ్బతీయాలని అనేక ప్రభుత్వాలు ప్రయత్నించాయి. ఏం చేసినా మార్గదర్శిపై నమ్మకాన్ని దెబ్బతీయలేకపోయారు అని చంద్రబాబు అన్నారు.
ఈనాడులో జిల్లా ఎడిషన్లు తెచ్చి క్షేత్రస్థాయి ప్రజాసమస్యలు ప్రస్తావించారు. ఈనాడు పత్రిక ద్వారా సమాజ హితం కోసం కృషి చేశారు. నటులు, జర్నలిస్టులు, కళాకారులకు జీవితం ఇచ్చారు. ప్రియా పచ్చళ్లను 150 దేశాలకు ఎగుమతి చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దారు అని చంద్రబాబు అన్నారు.
కొవిడ్ వచ్చినప్పుడు ప్రజలకు అండగా ఉన్నారు. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తిగా ఆయనను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని, తనకు ఫలానా పనిచేయాలని ఎప్పుడూ అడగలేదని, విలువల కోసం బతికారు. ప్రజల కోసం పోరాటం చేశారు అని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు.
రాజధానికి అమరావతి పేరు పెట్టాలని రామోజీరావు సూచించారు. తెలుగుజాతి ఉజ్వల భవిష్యత్తుకు అమరావతి నాంది పలుకుతుంది. తెలుగుజాతి గొప్పగా ఉండాలని ఎప్పుడూ ఆకాంక్షించేవారు. రామోజీ స్థాపించిన వ్యవస్థ. ఆ కుటుంబానిదే కాదు. పది కోట్ల మంది ప్రజలది అని చంద్రబాబు అన్నారు.
రామోజీరావుకు భారతరత్న సాధించడం మనందరి బాధ్యత. అమరావతిలో రామోజీ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తాం. అమరావతిలోని ఒక రోడ్డుకు రామోజీరావు పేరు పెడతాం. విశాఖలో చిత్రనగరికి రామోజీరావు పేరు పెడతాం అని ఈ సంధర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు.