గంటా శ్రీనివాసరావు చాలాకాలంగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. గంటా వైసీపీలో చేరబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, గంటా పార్టీ మారలేదు. అయితే, హఠాత్తుగా నారా లోకేష్ తో గంటాను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా గంటానుద్దేశించి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
టీడీపీ కష్టాల్లో ఉన్నప్పుడు దాక్కున్నవారంతా ఎన్నికల ముందు బయటికి వస్తున్నారని అయ్యన్న విమర్శించారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. వారే అసలు సిసలు టీడీపీ కార్యకర్తలు అని, పార్టీ కష్టాల్లో ఉంటే ఇంట్లో పడుకునేవాడు నిజమైన కార్యకర్త కాదని చెప్పారు. తనను కొందరు కాబోయే హోం మినిస్టర్ అన్నారని, లా అండ్ ఆర్డర్ తో కలిపి హోం మంత్రి పదవి ఇస్తే, తన తడాఖా చూపిస్తానని అయ్యన్న వ్యాఖ్యానించారు. తాను హోం మంత్రి అయితే కొందరు పోలీసు అధికారుల సంగతేంటో చూస్తానని షాకింగ్ కామెంట్స్ చేశారు.
లా అండ్ ఆర్డర్ సీఎం దగ్గర, హోం మినిస్ట్రీ మరొకరి దగ్గర ఉంటే ఏం పవర్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. లా అండ్ ఆర్డర్ అంటే షూట్ ఎట్ సైట్ అన్నట్టుండాలని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వంలో పనిచేసిన హోంమంత్రుల పేర్లను అయ్యన్న ప్రస్తావించారు. ముందొక కారు, వెనుకొక కారు తప్ప వారికి పవర్స్ ఏమున్నాయని అన్నారు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ సీఎం వద్దే ఉంటుందని చెప్పారు.