వైసీపీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన అవంతి…కీలక వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిలో కూర్చనొ కలెక్టరేట్ కు వెళ్లండి, ధర్నా చేయండి, గొడవ చేయండి అని చెప్పేస్తారు…తాడేపల్లిలో కూర్చొని చెప్పడం ఈజీనే అని జగన్ పై పరోక్షంగా అవంతి షాకింగ్ కామెంట్లు చేశారు. అయితే, ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుందని, ఇబ్బందులు ఉంటాయని అన్నారు.
‘‘నా హయాంలో నేనెలాంటి అవినీతి చెయ్యలేదు.. అవినీతిని ప్రోత్సహించలేదు. ఏ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి.. ఆరు నెలల నుంచి ఆందోళన.. నిరసనలు అంటే, కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్లే నడిపించారు. కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ఇప్పుడు నేతలందరిని ఒకేసారి రోడ్డు ఎక్కండి అంటే ఎంతవరకు సమంజసం’’ అని అవంతి ప్రశ్నించారు.
విశాఖ పట్నంలో ఆకస్మిక మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అవంతి.. తన రాజీనామాను ప్రకటించారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. రాజకీయంగా కొన్నాళ్లపాటు మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది మెగాస్టార్ చిరంజీవేనని అవంతి తెలిపారు. ప్రజారాజ్యం పార్టీతో తన రాజ కీయ జీవితం ప్రారంభమైందని.. తెలిపారు. అయితే.. ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకొంటా నని ప్రకటించారు. అయితే.. దీనిపై తన కుటుంబంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పడం విశేషం. కాగా.. ప్రజారాజ్యం పార్టీ నుంచి టీడీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావు.. 2014లో అనకాపల్లి ఎంపీగా విజయం దక్కించుకున్నారు. అయితే.. 2019 ఎన్నికలకుముందు ఆయన వైసీపీ లోకి వచ్చారు.
ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన అవంతి.. తర్వాత ..వైసీపీ అధినేత జగన్ మంత్రి వర్గంలోనూ పనిచేశారు. ఈ ఏడాది అదే భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు చేతిలో పరాజయం పాలయ్యారు. తర్వాత పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే, శుక్రవారం నుంచి వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సమయంలో అవంతి పార్టీకి రాజీనామా చేయడం భారీ దెబ్బేనని అంటున్నారు పరిశీలకులు.