వైసీపీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి షాక్ తగిలింది. జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో సీఐడీ సిట్ దూకుడు పెంచింది. సూత్రధారులు, పాత్రధారులకు వరుసగా ఉచ్చు బిగిస్తోంది. తాజాగా విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి ముఖ్య పాత్రధారిగా భావిస్తున్న సిట్.. ఆయన్ను ఈ నెల 18న విజయవాడ సీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.
అయితే కాకినాడ పోర్టు కేసులో సీఐడీ ఎదుట విచారణకు హాజరైన సమయంలో విజయసాయిరెడ్డి రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం స్కామ్‌లో కర్త, కర్మ, క్రియ రాజ్ కసిరెడ్డేనని విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. తనను విచారణకు పిలిస్తే ఆధారలతో సహా అన్ని విషయాలు బయటపెడతానని వ్యాఖ్యానించారు. తాజాగా సీఐడీ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వడంతో సీన్ ఆసక్తికరంగా మారింది.
కాగా, మరోవైపు ఈ స్కామ్‌లో కింగ్ పిన్‌గా ఉన్న జగన్ బంధువు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి కోసం సిట్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఒకప్పుడు ఐ ప్యాక్ లో పని చేసుకునే ఓ సాదాసీదా వ్యక్తి అయిన కసిరెడ్డి.. వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యం నుంచి డబ్బుల పంట పండించి కోట్లకు పడగలెత్తాడు. మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి సినిమాలు, ఆస్పత్రుల్లో పెట్టుబడులుగా పెట్టాడు. ఇప్పుడు కుటుంబంతో సహా పరారీలో ఉన్నాడు. సిట్ విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిట్ అధికారులు కసిరెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.