సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వంటి ప్రతిష్టాత్మక హోదాలో ఇప్పటికే ఇద్దరు తెలుగువారు పనిచేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎంపికైన తొలి తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు పేరు చరిత్రలో నిలిచిపోగా, ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆ ఘనత సాధించిన రెండో తెలుగు వ్యక్తిగా చరిత్రపుటల్లోకెక్కారు. ఇక, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ అత్యున్నత పదవిని మరో తెలుగు వ్యక్తి చేపట్టే అవకాశముంది.
తాజాగా సుప్రీంకోర్టులో 9 మంది న్యాయమూర్తుల నియామకం కోసం ప్రభుత్వానికి కొలీజియం సిఫార్సు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసిన ఆ తొమ్మిది మందిలో ఏపీకి చెందిన సుప్రీం కోర్టు సీనియర్ అడ్వకేట్ పీఎస్ నరసింహ రాబోయే కాలంలో సీజేఐ అయ్యే అవకాశముంది. అడ్వకేట్ పిఎస్ నరసింహా పేరును ప్రభుత్వం ఆమోదిస్తే…బార్ అసోసియేషన్ నుంచి నేరుగా సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నియామకమైన 9 మందిలో అడ్వకేట్ నరసింహా ఒకరు కానున్నారు.
భారత ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) గా పనిచేసిన నరసింహా భవిష్యత్‌లో భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం కూడా ఉందనే చర్చ జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరామయ్య కుమారుడే ఈ అడ్వొకేట్ నరసింహా. కొలీజియం సిఫారసు చేసిన 9 మందిలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కొలీజియం సిఫారసులు యథావిధిగా ఆమోదం పొందితే కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న భవిష్యత్తులో తొలి భారత సుప్రీం కోర్టు మహిళా ప్రధాన న్యాయమూర్తిగా చరిత్ర పుటల్లోకెక్కనున్నారు.
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, కర్నాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏ.ఎస్. ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాధ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జే.కే.మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సి.టి. రవికుమార్, మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుందరేశ్ పేర్లు కూడా సిఫార్సు చేశారు.. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా త్రివేది, ( మహిళ న్యాయమూర్తి) పేరును కూడా సిఫార్సు చేసింది కొలీజియం.