టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్, ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, మద్యం షాపుల వ్యవహారంలో అవకతవకలు వంటి కేసులను చంద్రబాబుపై సిఐడి పెట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బెయిల్ పై విడుదలైన మరుసటి రోజే ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేయడం సంచలనం రేపింది. చంద్రబాబు హయాంలో ఇసుక అక్రమ రవాణా, అమ్మకం జరిగిందని పేర్కొంటూ ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతను ఏ1గా, చంద్రబాబును ఏ2గా, చింతమనేని ప్రభాకర్ ను ఏ3గా, దేవినేని ఉమను ఏ4గా సిఐడి అధికారులు చేర్చారు. చంద్రబాబు హయాంలో ఇసుక తవ్వకాల నేపథ్యంలో ప్రభుత్వ ఖజానాకు 10వేల కోట్ల రూపాయల గండి పడిందని సిఐడి అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే, చంద్రబాబుకు బెయిల్ లభించడంతో ఆయనపై కక్షపూరితంగానే ప్రభుత్వం మరో కేసు నమోదు చేసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.