తెలుగు మీడియా ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తారు ఆంధ్రజ్యోతి యజమాని కమ్ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ మిగిలిన వారికి ఆయనకు ఉన్న తేడా ఏమిటంటే.. తెలుగునాట ఏ ప్రతికాధిపతి కూడా జర్నలిస్టు కాదు. అందుకు ఆర్కే మాత్రమే మినహాయింపు. అగ్రశ్రేణిపత్రికల్లో ఒకటైనప్పటికీ.. పనులెన్ని ఉన్నా.. వారం తిరిగేసరికి తాను చెప్పాలనుకున్న విషయాల్ని.. రాజకీయ విశ్లేషణల్ని తనదైన కోణంలో విప్పి చెప్పే గుణం ఆయన సొంతం.
ఆయన రాసే రాతల్ని అర్థం చేసుకునే వారెందరో.. అపార్థం చేసుకునేవారు అంతే ఉంటారు. అయినా.. తాను చెప్పాల్సిన విషయాన్ని చెప్పేసేందుకు అస్సలు వెనుకాడరు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన దూకుడు చాలామందికి మింగుడుపడదనే చెప్పాలి. ప్రతి వారాంతంలోనూ కొత్తపలుకు పేరుతో ఆయన రాసే వ్యాసం తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చలకు అవసరమైన ముడిసరుకును ఇస్తుంటుంది. గత వారం ఆయన తన వ్యాసంలో ఒక సంచలన అంశాన్ని ప్రస్తావించారు.
అదేమంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.వెయ్యి కోట్లు ఆఫర్ చేశారని.. ఆ ప్రపోజల్ కు పవన్ కల్యాణ్ స్పందించలేదని పేర్కొన్నారు.
తాను అందించే ప్యాకేజీ తీసుకోవటం ద్వారా.. పవన్ తాను చెప్పినట్లుగా పని చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా ఆర్కే పేర్కొన్నారు. ఆయన వెల్లడించిన ఈ అంశాలపై సోషల్ మీడియాలోనూ.. యూట్యూబ్ చానళ్లలోజరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవటానికి వీలుగా ఇలాంటి విశ్లేషణ చేశారని.. ఈ రాతల వెనుక బాబు ఉన్నారని.. ఆయన చెప్పిన డైరెక్షన్ లోనే ఆర్కే ఇలాంటి రాతలు రాశారన్న వాదనను పలువురు వినిపించారు. పవన్ ఇమేజ్ ను దెబ్బ తీసేలా వేమూరి రాధాకృష్ణ అక్షరాలు ఉన్నాయని జనసైనికులు మండిపాటు వ్యక్తమైంది. తమ అధినేతను ముఖ్యమంత్రికుర్చీలో చూడాలని భావించే పవన్ అభిమానులు.. ఆర్కే చెప్పిన విషయాల్ని.. ఆయన ప్రస్తావించిన అంశాలను తమకుఅర్థమైనట్లుగా అన్వయించుకున్న పరిస్థితి.
ఇలాంటి వేళ.. తాను ఏదో చెబితే.. మరేదో అర్థమైందన్న విషయాన్ని ఆర్కే గుర్తించారు. కేసీఆర్ మాయోపాయాన్ని బయటపెట్టటం ద్వారా.. చంద్రబాబు – పవన్ మధ్య బంధాన్ని మరింత బలపరుస్తాయని భావిస్తే.. అందుకు భిన్నంగా తన రాతలకు తప్పుడు భాష్యాలు తీయటం.. వాటిని జనసైనికుల్లో ఎక్కువ మంది నమ్మేసినట్లుగా ఆర్కేకు అర్థమైంది. అందుకు.. ఆయన ఎప్పుడూ లేని విధంగా తన రాతలకు సంబంధించిన వివరణను ఇచ్చుకోవాల్సి వచ్చింది. అపార్థం కాదు అర్థం చేసుకోవాలంటూ ఆయన తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలన్న తన అభిమతానికి.. సీఎం కేసీఆర్ వేసిన ప్లాన్ ను బయటపెడితే పాజిటివ్ గా మారుతుందన్న ఆయన అంచనాలు తప్పుగా జనాల్లోకి వెళ్లడంతో… ఆయన తన అక్షరాల వెనుకున్న ఉద్దేశాన్ని మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో.. తనను అపార్థం చేసుకోవద్దన్న మాట ఆయన నోటి నుంచి వచ్చింది. తాను రాసిన విషయాన్ని.. తాను నమ్మిన స్టాండ్ మీద నిలబడే విషయంలో ఆర్కే మొండిగా.. పట్టుదలతో వ్యవహరిస్తారని చెబుతారు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో ఆయన తీరు భిన్నమని చెప్పాలి.
తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసినా.. వైసీపీ వర్గాలు తన మాటల్ని ట్విస్టు చేసి.. తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చేసి ప్రచారం చేయటంతో.. ఆయన నోటి నుంచి తొలిసారి విన్నపం వచ్చినట్లుగా చెబుతున్నారు. తాను రాసిన ఆర్టికల్ మీద ఆర్కే తాజాగా రియాక్టు అయిన వాటిల్లో ముఖ్యమైన వ్యాఖ్యల్ని తీసుకుంటే.. ఆయన ఏం చెప్పారన్నది అర్థమవుతుంది.
– ‘యథార్థవాది లోక విరోధి’ అని అంటారు. ఆకాంక్షలు, ఆశలు అధికంగా ఉన్నప్పుడు అపోహలు, అపార్థాలు, అసహనం కూడా అధికంగానే ఉంటాయి. గత ఆదివారం నేను ‘కొత్త పలుకు’లో చెప్పిన అంశాలను అర్థం చేసుకున్నవారి కంటే అపార్థం చేసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. అపార్థం చేసుకున్న వారిలో అత్యధికులు పవన్ కల్యాణ్ అభిమానులే. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులే అందుకు కారణం.
2024లో జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని ఓడించాలంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోకూడదన్నది ఒక అభిప్రాయం. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా వివిధ సందర్భాలలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. అయితే వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని ఆ పార్టీలో ఓ వర్గం బలంగా కోరుకుంటున్నది.
– తెలుగుదేశం పార్టీతో జత కడితే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కాలేరన్నది ఈ వర్గం అభిప్రాయం. తెలుగుదేశంలో కూడా ఒక వర్గంవారు జనసేనతో పొత్తు లేకుండా పోటీ చేసినా అధికారంలోకి వస్తామనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ పరిస్థితులలో అధికార వైసీపీ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా ఆ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలను రెచ్చగొట్టే పనిలో ఉంది.
– తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహం గురించి నేను ‘కొత్త పలుకు’లో పేర్కొన్న అంశాలను వైసీపీ వాళ్లు ముడిసరుకుగా వాడుకుని పవన్ కల్యాణ్ అభిమానులను రెచ్చగొట్టాలని చూశారు. పవన్ కల్యాణ్‌కు ప్యాకేజీ ఆఫర్ చేశారని కానీ, అందుకు ఆయన అంగీకరించారని కానీ నేను నా కాలమ్‌లో ఎక్కడా రాయలేదు. కేవలం కేసీఆర్ వ్యూహాలు మాత్రమే వివరించాను.
– తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటే కేసీఆర్‌కు పొసగదు అన్న విషయం బహిరంగ రహస్యమే. చంద్రబాబు బలపడితే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని విస్తరింపజేయడానికి ఆయన ప్రయత్నిస్తారు. కనుక చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రాకూడదని కేసీఆర్ సహజంగానే కోరుకుంటారు. ఈ కారణంగానే తెలుగుదేశం–జనసేన మధ్య పొత్తు కుదరకుండా అడ్డుకోవడం కోసం ఆయన వ్యూహరచన చేస్తున్నారని నేను చెప్పాను.
– ఇందులో పవన్ కల్యాణ్‌కు పాత్ర ఉందని కానీ, కేసీఆర్ ప్రతిపాదనలకు ఆయన అంగీకరించారని కానీ నేను ఎక్కడా ప్రస్తావించలేదు. కేసీఆర్ వ్యూహాలు కేంద్రంగా మాత్రమే నేను గత వారం ‘కొత్త పలుకు’లో రాశాను. కేసీఆర్ మాత్రమే కాదు.. జగన్మోహన్రెడ్డికి పరోక్షంగా సహకరిస్తున్న అనేక మంది కూడా వివిధ మార్గాలలో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు కుదరకుండా తమ ప్రయత్నాలు తాము చేస్తున్నది నిజం. ఈ క్రమంలో అటువంటివారు జనసేనాని పవన్ కల్యాణ్ బుర్ర తింటున్నారట కూడా. ఆయన ఒకరిద్దరి వద్ద ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు కూడా.