సెలబ్రిటీలు.. ప్రముఖులు ఒళ్లు దగ్గర పెట్టేసుకోవాలి. గతంలో మాదిరి మీడియా మాత్రమే ఉండి.. బయటకు రాని శక్తుల ద్వారా ఇన్ ఫ్లూయెన్స్ చేసుకొని.. కొన్ని ప్రతికూల పరిస్థితుల్ని బయటకు రాకుండా మేనేజ్ చేసే రోజులు పోయాయి. ఒకసారి కమిట్ అయితే అంతే అన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి సోషల్ మీడియా కాలంలో చోటు చేసుకుంది. ఒకసారి పోస్టు చేస్తే ఇక అంతే. మంచిగా ఉన్నంతవరకు ఫర్లేదు. తేడా కొట్టే చిన్న పోస్టుకైనా సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. తాజాగా అలాంటి ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది ప్రముఖ యాంకర్ కమ్ నటి అనసూయ.
తన హుషారైన మాటలతో బుల్లితెర మీద వెలిగిపోయే అనసూయ తన పని తాను చేసుకోకుండా.. లేనిపోని విషయంలో తలదూర్చి ఇప్పుడు తల పట్టుకునే పరిస్థితి. ఉత్సాహంతో తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేయటం.. దానికి తన అభిప్రాయాన్ని వెల్లడించటంతో ఆమెపై దుమ్మెత్తి పోసే వారు పెరిగారు. ఈ నిరసనల సెగను అర్థం చేసుకున్న ఆమె నష్టనివారణ ప్రయత్నాల్ని ముమ్మరం చేశారు. అయినా తిట్ల వర్షం మాత్రం తగ్గని పరిస్థితి.
గుజరాత్ లోని బిల్కిస్ బానో సామూహిక అత్యాచార కేసులో ఉన్న దోషులను జైలు నుంచి విడుదల చేయడం.. వారికి ఒక సంస్థ సన్మానం చేయటం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తాంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి ఇదో ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ ఉదంతంపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తో పాటు.. తెలంగాణ సీఎంవోకు చెందిన ఐఏఎస్ అధికారులు సైతం ట్వీట్లు చేయటం తెలిసిందే.
ఈ వైనాన్ని చూడాల్సిన రీతిలో చూడని అనసూయ.. తన సోషల్ మీడియా ఖాతాలో కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేయటమే కాదు.. బిల్కిస్ బానో ఉదంతంపై తన అభిప్రాయాన్ని పోస్టు చేశారు. కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ.. ‘‘ఇది దారుణం. మనం స్వేచ్ఛను పునర్ నిర్వచిస్తున్నట్లుగా అనిపిస్తోంది. రేపిస్టులను విడిచిపెట్టి.. మహిళల్ని ఇంటికే పరిమితం చేసేలా ఉన్నాం’ అంటూ వ్యాఖ్యానించింది. దీనిపై నెటిజన్లు ఆమెపై ఒకరేంజ్ లో విమర్శలు కురిపిస్తున్నారు.
కేటీఆర్ ట్వీట్ ను రీట్వీట్ చేసిన అనసూయ.. హైదరాబాద్ లోని మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం వేళ.. ఎందుకు మాట్లాడలేదని.. ఎందుకు నోరు విప్పలేదు? అని తీవ్రంగా తప్పు పట్టారు.
సోషల్ మీడియాలో తన ట్వీట్ పై జరుగుతున్న రచ్చను గుర్తించిన అనసూయ.. ఈ వివాదం నుంచి ఎస్కేప్ అయ్యేందుకు వీలుగా రియాక్టు అయ్యారు. తాను చేసిన ట్వీట్ ను రాజకీయం చేస్తున్నారని.. తన సొంత అభిప్రాయాన్ని చెబుతున్నానని.. అందుకు ఎవరితోనూ సంబంధం లేదన్నారు.
తాను ఎవరినో ప్రమోట్ చేసేందుకో.. డబ్బులు తీసుకొనో ట్వీట్ చేయలేదని చెప్పారు. అంతేకాదు.. గుజరాత్ లో ఏం జరిగిందో తెలుసుకొని పూర్తి అవగాహనతోనే తాను మాట్లాడుతున్నట్లుగా పేర్కొన్నారు. అయినప్పటికీ తన కామెంట్ ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని.. దయచేసి తన ట్వీట్ ను రాజకీయం చేయొద్దని ఆమె వేడుకుంటున్నారు.
ఇంత చెప్పిన అనసూయ.. హైదరాబాద్ మహానగరంలో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ మీద జరిగిన దాని మీద మాత్రం మాట వరసకు స్పందించకపోవటం గమనార్హం. తాజాగా ఆమె ఇచ్చిన వివరణ నేపథ్యంలోనూ నెటిజన్లు తమ ఫైరింగ్ తగ్గించట్లేదు. ‘అలాంటప్పుడు మీరు రాజకీయ అంశాలకు దూరంగా ఉండండి. మీరు ఒక నటి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి’ అంటూ సూటిగా.. సుత్తి లేకుండా ట్వీట్ పంచ్ లు వేసేశారు.అందుకే చెప్పేది.. తమకు సంబంధం లేని విషయాల జోలికి వీలైనంతవరకు వెళ్లకుండా ఉండాలని. ఇప్పటికైనా అనసూయకు విషయం అర్థమైందో లేదో?