ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిగా పోటీ చేసి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ ని చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాన్ని పడగొట్టి కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.
మరోవైపు గత వైకాపా పాలనలో జరిగిన అన్యాయాలను, అక్రమాలను వరుసగా బయటకు లాగుతున్నారు. ఇదే తరుణంలో అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది వైకాపా నాయకులు ఊ.. అంటే టీడీపీలోకి దూకేస్తామంటూ తెగ తొందర పడుతున్నారు. టీడీపీలో చేరడానికి అనుమతి ఇవ్వమంటూ ఆ పార్టీ నాయకుల వెంటపడుతున్నారు. అయితే పార్టీ మారడానికి ఇంతలా తొందర పడటానికి కారణం లేకపోలేదు.
జగన్ హయామంలో వైసీపీ చోటామోటా నాయకులు అవినీతి, అక్రమాలతో కోట్లకు పడగలెత్తారు. ఐదేళ్లలో ప్రజలకు ఏ మేలు చేయకపోగా.. ప్రతి పనికి రేటుతో చెలరేగిపోయారు. రెండోమారు వైసీపీ అధికారంలోకి వస్తుందన్న భ్రమలో అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభపెట్టారు. కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. తమ స్వేచ్ఛను హరించేసిన వైసీపీని ఓటర్లు ఉతికారేశారు. ఫ్యాన్‌ను భూస్థాపితం చేసి టీడీపీ కూటమికి ఓట్ల వరద కురిపించారు.
ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో వైకాపా నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట పడింది. అంతేగాక గత ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అన్యాయాలు అధికార పార్టీ బయటకు లాగితే ఇబ్బందులు తప్పవని కొందరు వైసీపీ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ మారేందుకు టీడీపీ నాయకులతో రాయబారాలు షురూ చేశారు. అయితే అటువంటి అక్రమార్కులను టీడీపీలో చేర్చుకోవడానికి కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం ఏమాత్రం మొగ్గు చూడడం లేదు.