సుదీర్గ కాలంగా(9 నెలలు) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన అమెరికా అంతరిక్ష వ్యోమ గాములు.. సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. క్రూడ్రాగన్ వ్యోమ నౌక ద్వారా.. ఇరువురితోపాటు.. మరో ముగ్గురు వ్యోమగాములు సైతం భూమికి చేరుకున్నారు. భారత కాల మానం ప్రకారం.. బుధవారం తెల్లవారు జామున 3 గంటల 27 నిమిషాల సమయంలో అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న సముద్ర తీరానికి క్రూ డ్రాగన్ చేరుకుంది.
ఆ వెంటనే నాసా సిబ్బంది క్రూ డ్రాగన్ను సముద్రం నుంచి బయటకు తీసుకువచ్చి.. వ్యోమగాములను సురక్షితంగా తొలుత నాసా కేంద్రానికి తరలించారు. వారికి అక్కడే ప్రాధమిక వైద్య పరీక్షలు నిర్వహించ నున్నారు. సుదీర్ఘ కాలంగా రోదసీలో ఉండిపోవడంతో వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన ఉన్నప్పటికీ.. ప్రాధమిక వైద్య పరీక్షల అనంతరం.. వారు ఆరోగ్యంగానే ఉన్నారని.. స్వల్ప దుష్ప్రభావాలు తప్ప.. ఏమీ లేదని నాసా గుర్తించింది. అయినప్పటికీ.. 24 గంటల పాటు సునీత, విల్మోర్లను అధ్యయనంలో ఉంచనున్నట్టు నాసా తెలిపింది. కండరాల బలహీనత, ఎముకల పరిస్థితిని తెలుసుకోనున్నారు. వారికి అవసరమైన పక్షంలో మెరుగైన వైద్యం అందించనున్నారు.
కాగా, సునీత, విల్మోర్లు క్షేమంగా భూమిని చేరుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. వారిద్దరికీ అభినందనలు తెలిపారు. వెల్ కమ్ క్రూ 9..భూమి మిమ్మల్ని మిస్ అయింది అని మోదీ అన్నారు. క్లిష్ట పరిస్థితులను తట్టుకొని ధైర్యంగా నిలబడి ఎందరికో స్ఫూర్తిదాయకంగా, ఆదర్శప్రాయంగా నిలిచారని కొనియాడారు.
మరోవైపు, సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ సురక్షితంగా భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ నుంచి 286 రోజుల తర్వాత వారు సురక్షితంగా భూమిపైకి ప్రయాణించడం ఆదర్శప్రాయమైన మానవ సంకల్పం అని కొనియాడారు. వారిద్దరూ తిరిగొచ్చేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని చెప్పారు. వారి బలం, పట్టుదలకు తాను సెల్యూట్ చేస్తున్నానని, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరారు. మరోవైపు, సునీతా విలియమ్స్ బృందానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అభినందనలు తెలిపింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయని సునీత ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న కొనియాడారు.