నాసా అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్(58), బుచ్ విల్మోర్(61) ఇంటర్నేషనల్ స్పేస్ స్పేషన్(ఐఎస్ఎస్) నుండి భూమిపైకి సురక్షితంగా వచ్చిన సంగతి తెలిసిందే. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఫ్రీడమ్ వారిద్దరినీ మార్చి 19 తెల్లవారుజామున 3.27 గంటలకు అమెరికాలోని ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో ల్యాండ్ చేసింది. సహాయ బృందాలు క్యాంపుల్స్ నుంచి వ్యోమగాములను బయటకు తీసి వైద్య పరీక్షల కోసం తరలించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి వచ్చిన స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్ను లైవ్ కవరేజ్గా నాసా అందించింది. ఈ మిషన్ సేఫ్ గా ముగియడంతో యావత్ ప్రపంచం ఆనందంతో ఉప్పొంగిపోతోంది.
2024 జూన్ 5న టెస్ట్ మిషన్ కోసం స్టార్లైనర్ అంతరిక్ష నౌకలో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ప్రయాణించారు. ఎనిమిది రోజుల అనంతరం వారు తిరిగి భూమ్మీదకు రావాల్సింది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉంచాలని నాసా నిర్ణయించింది. దాంతో సునీత, విల్మోర్ లను వదిలేసి స్టార్లైనర్ భూమికి తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి తొమ్మిది నెలలు (286 రోజులు) స్పేస్లో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్ లు ఎన్నో సవాళ్లు, మరెన్నో అనుభావాలు ఎదుర్కొన్నారు. క్రూ నైన్తో కలిసి స్పేస్ వాక్, అంతరిక్షంలో మొక్కల పెంపకం సహా అనేక ప్రయోగాల్లో పాల్గొన్నారు.
ఫైనల్ గా నేడు దివి నుంచి భువికి దిగి వచ్చారు. అయితే స్పేస్లో తొమ్మిది నెలలు ఉన్న సునీత విలియమ్స్ ఎన్నిసార్లు భూమిని చుట్టారో, రోజుకు ఎన్నిసార్లు సూర్యోదయాలను చూశారో తెలిస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్లో వారు గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. దీని వల్ల సునీత రోజుకు 16 సార్లు భూమిని చుట్టేవారు. అంటే రోజుకు 16 సూర్యోదయాలు చూసేవారు. ప్రతి 45 నిమిషాలకోసారి ఆమెకు సూర్యోదయం అయ్యేది. ఇక 286 రోజులకు గానూ ఏకంగా ఆమె 4,500ల సార్లు భూమి చుట్టూ తిరిగారు. ఈ క్రమంలోనే సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న సునీత విలియమ్స్ ను స్పేస్ క్వీన్ అంటూ యావత్ ప్రపంచం ఆమెపై ప్రశంసలు కురిపిస్తోంది. సునీత విలియమ్స్, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ కు ఘన స్వాగతం అంతా పలుకుతున్నారు.