తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్పేషన్(ఐఎస్ఎస్) నుండి భూమిపైకి వచ్చారు. మార్చి 19 తెల్లవారుజామున 3.27కు ఫ్లోరిడాలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు. వారం రోజుల మిషన్ కోసం వెళ్లిన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ లు స్పేస్ షిప్ లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలోనే చిక్కుకుపోయారు.
అప్పటినుంచి వారిద్దరిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఫైనల్ గా 9 నెలల నిరీక్షణకు తెర దించుతూ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లో మరో ఇద్దరు వ్యోమగాములను అంతరిక్షానికి పంపి సునీత, విల్మోర్ లను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చింది. సముద్రంలో ల్యాండ్ అయిన అనంతరం నలుగురు వ్యోమగాములను నాసా అధికారులు వైద్య పరీక్షల కోసం తరలించారు. అయితే సునీత, విల్మోర్ సేఫ్ గా భూమిపై అడుగు పెట్టడంతో యావత్ ప్రపంచం వారికి స్వాగతం పలుకుతోంది.
సునీత భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో ఇండియన్స్ ఆమె అద్భుత ప్రయాణం, అచంచలమైన అంకిత భావం, ధైర్యం, పోరాట పటిమను అభినందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం సునీతకు హృదయపూర్వకంగా వెల్కమ్ చెబుతున్నారు. అయితే సునీత రాకపై తాజాగా స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీత, విల్మోర్ తిరిగి భూమికిపైకి తీసుకురావడానికి తమ కంపెనీ తరఫున బైడెన్ ప్రభుత్వానికి గతంలోనే ప్రతిపాదన చేశామని మస్క్ తెలిపారు. వ్యోమగాములను వాపస్ తీసుకొచ్చేందుకు మరో వ్యోమనౌకను పంపిస్తామని ఆఫర్ ఇచ్చామని.. కానీ రాజకీయ కారణాలతో బైడెన్ తమ ఆఫర్ ను రిజెక్ట్ చేశారని.. అందుకే వారు తిరిగిరావడం ఇంత ఆలస్యమైందని మస్క్ అన్నారు. ఏదేమైనా సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ క్షేమంగా భూమిపైకి రావడం ఆనందకరమని.. వారిని తీసుకువచ్చే ఆపరేషన్ లో పాలుపంచుకున్న నాసా, స్పేస్ ఎక్స్ సిబ్బందికి ఆభినందనలు అంటూ మస్క్ పేర్కొన్నారు.