ఇప్పుడు నడుస్తున్న రాజకీయాల్లో నేతల ఇమేజ్ ను సోషల్ మీడియా.. యూట్యూబ్ లు పెంచటం.. తగ్గించటం లాంటివి చేస్తూ కీలక భూమిక పోషిస్తున్నాయి. పదునైన మాటలు.. తన వాదనలో లాజిక్ మిస్ కాకుండా చూసుకోవటం.. నెల్లూరు యాసలో మహా ఎటకారంగా పంచ్ లు వేసే టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి సుపరిచితులుగా మారారు. నెల్లూరు రాజకీయం గురించి ఏ మాత్రం అవగాహన లేనోళ్లు సైతం వెంకటరమణా రెడ్డి గురించి మాత్రం చాలా బాగా చెబుతారు. అంతలా ఆయన పాపులర్ అయ్యారు.
ఈనాడులో అచ్చేసిన ప్రముఖ ఆర్థికవేత్త జీవీ రావు ఇంటర్వ్యూపై కావలిలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాను ఈనాడు పేపర్లో చదివిన జీవీ రావు ఇంటర్వ్యూ తర్వాత ఆయన గురించి ఆరా తీస్తే.. ఆయన్ను చార్టెడ్ ఎకౌంటెంట్ గా తీసేసినట్లుగా తెలిసిందని.. ఆయన కోసం గూగుల్ లో వెతికితే..ఆయన డ్యాన్సు వేసే వీడియోలు కనిపించినట్లుగా చెప్పి.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఈ నేపథ్యంలో ఎంట్రీ ఇచ్చారు ఆనం వెంకటరమణారెడ్డి. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలకు అంతే ధీటుగా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘జీవీ రావు ఎవరో తెలీకుండానే సాక్షి ఛానల్ లో వచ్చే బిజినెస్ కార్యక్రమాలకు ఆయన్ను ఆహ్వానించారా? మీకు మంచిగా చెబితే సూపర్.. చెడుగా మాట్లాడితే వెధవా? ఇదేం న్యాయం? జీవీ రావు ఎలాంటి వారో మీ సతీమణి భారతీరెడ్డి.. సాక్షి ప్రతినిధుల్ని అడిగి తెలుసుకోవాలి. ఏప్రిల్ ఆరో తేడీన సాక్షి ఛానల్ లో ప్రముఖ ఆర్థిక విశ్లేషకునిగా జీవీ రావును ఇంటర్వ్యూ వేశారు. అంటే.. మీ చానల్ లో స్టాక్ మార్కెట్ విశ్లేషణ లాంటి ముఖ్యమైన కార్యక్రమాల్ని దారినపోయే దానయ్యలు.. జోకర్లతో చేస్తారా?’’ అంటూ ఫైర్ అయ్యారు.
పొద్దున్న లేచింది మొదలు ప్రతి సమావేశంలో రామోజీ రావును తిడతారన్న ఆనం.. ‘మీ భార్య నడిపే సాక్షి చదువుతారో లేదో తెలియదు కానీ ఈనాడు మాత్రం మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదువుతానని మీరే అంగీకరించారు. మీ చానల్ లో జీవీ రావు మాట్లాడినప్పడు ఆయన ఆఫ్రికా నుంచి వచ్చారని తెలియదా? ఒక మనిషి నల్లగా ఉంటే ఆఫ్రికా నుంచి వచ్చినట్టా? గూగుల్ చేస్తే జీవీ రావు డ్యాన్సులు కనిపిస్తాయి అంటూ మీరు అన్నాడు. డ్యాన్సులు వేస్తూ ఇన్ స్టాలో వీడియోలు పెట్టిన వారికి మీరు మంత్రి పదవులు ఇవ్వలేదా?
మీ మంత్రులో న్యాయం.. జీవీ రావుకో న్యాయమా? దమ్ముంటే నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి లేదంటే విషయం తెలిసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో మాట్లాడించండి. విమర్శ చేసే ముందు సదరు వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోండి. నచ్చలేదని వ్యంగ్యంగా మాట్లాడటం మంచిది కాదు’’ అంటూ విరుచుకుపడ్డారు. అంతా బాగుంది కానీ.. జీవీ రావు గురించి మాట్లాడాలని ముఖ్యమంత్రి జగన్ కు ఫీడ్ బ్యాక్ ఇచ్చిందెవరు? తమ సాక్షి చానల్ లో జీవీ రావు కంట్రిబ్యూషన్ ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకోకుండా సీఎం జగన్ ను ఇరుకున పడేశారే అన్న మాట వినిపిస్తోంది.