మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రతి ఒక్క మోడల్ కు మిస్ యూనివర్స్ కావాలన్నది ఓ కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు లక్షలాది మంది మోడళ్లు ఏళ్ల తరబడి ప్రయత్నిస్తుంటారు. అయితే, విశ్వ సుందరి కావడానికి అందంతో పాటు కాసింత అదృష్టం…మరికొంత ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. అలా అందం, అభినయం, అదృష్టం, ఆత్మవిశ్వాసం ఉన్నవారికే ఆ ప్రతిష్టాత్మక కిరీటం దక్కుతుంది.
ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే…మిస్ యూనివర్స్ 2022 కిరీటాన్ని అమెరికాకు చెందిన గేబ్రియల్ దక్కించుకుంది. మిస్ యూనివర్స్ 71 వ ఎడిషన్ ఫైనల్ లో పలు దేశాలకు చెందిన 80 మందిని వెనక్కి నెట్టి గేబ్రియల్ విశ్వసుందరి కిరీటాన్ని అందుకుంది. 2022 మిస్ యూనివర్స్ గా గేబ్రియల్ పేరును ప్రకటించగానే 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు తన కిరీటాన్ని గేబ్రియల్ కు అందించింది.
తనకు దక్కిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని ఒక మార్పు కోసం వాహకంగా ఉపయోగిస్తానని జ్యూరీకి గేబ్రియల్ చెప్పిన సమాధానం ఆమెను విశ్వసుందరిగా నిలిపింది. తాను 13 సంవత్సరాలుగా ఫ్యాషన్ డిజైనర్ గా పనిచేస్తున్నానని, ఫ్యాషన్ ను మంచి కోసం ఉపయోగిస్తానని ఆమె చెప్పింది. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తానని, మానవ అక్రమ రవాణా, గృహహింస నుంచి బయటపడిన మహిళలకు తాను కుట్టు శిక్షణ తరగతులు ఇస్తున్నానని చెప్పింది.
ఇక, ఈ పోటీల్లో వెనెజులాకు చెందిన అమండా డుడమెల్ ఫస్ట్ రన్నరప్ గా నిలవగా, డొమినికన్ రిపబ్లిక్ కు చెందిన ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్ రన్నరప్ గా నిలిచింది. ఈ పోటీల్లో కర్ణాటకకు చెందిన దివిట రాయ్ భారత్ కు ప్రాతినిధ్యం వహించింది. కానీ, కేవలం టాప్ 16 లో చోటు దక్కించుకొని దివిట రాయ్ సంతృప్తి చెందాల్సి వచ్చింది.