నేరాలు చేసిన వారి విషయంలో రెడ్ బుక్ అమలు చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. గత ఐదేళ్లలో వైసీపీ నాయకులు అనేక అరాచకాలకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజలను నానా తిప్పలు పెట్టారని, ప్రజాస్వామ్యం గొంతు నులిమారని, భావప్రకటనను తమ కాళ్ల ముందు బందీ చేసుకున్నారని.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు యువ గళం పాదయాత్రలో రెడ్ బుక్ గురించి ప్రస్తావించానని.. ఇప్పుడు అదే అమలు చేస్తున్నామని నారా లోకేష్ వ్యఖ్యానించారు. వైసీపీ నాయకులు భూకబ్జాలు చేశారని.. వారిపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.
ప్రజలకు న్యాయం చేసేందుకే.. కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని.. ఈ క్రమంలోనే చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “వైసీపీ హయాంలో అరాచకాలు చేసిన వారిని శిక్షించాలని ప్రజలు కోరుకుంటు న్నారు. నేను కూడా గతంలో యువగళం పాదయాత్రలో రెడ్ బుక్‌లో పేర్లు రాసుకుంటున్నట్టు చెప్పాను. ఇప్పుడు దానినే అమలు చేస్తున్నాం. ఇందులో తప్పేముంది?“ అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు.. అధికారం అడ్డు పెట్టుకుని టీడీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడ్డారని ఆరోపించారు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదిలి పెట్టేది లేదని నారా లోకేష్ తేల్చి చెప్పారు.
వంశీ అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తూ.. “ఒక ఎస్సీ కార్యకర్తను కిడ్నాప్ చేసిన కేసులో వంశీ అరెస్టయ్యాడు. చట్టం ప్రకారం శిక్షించి తీరుతాం. చూస్తూ ఊరుకోవడానికి కాదు కదా.. ప్రజలు మాకు అధికారం ఇచ్చింది“ అని లోకేష్ అన్నారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అరాచక పాలన జరిగిందన్నారు. ప్రజలను, అప్పటి ప్రతిపక్షాలనుకూడా ఎంత వేధించారో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబును కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా గేట్లకు తాళాలు వేశారని.. దాడులు చేశారని, పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగిందని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన గళాలపైనా దాడులు చేశారని అన్నారు. ఇప్పుడు రెడ్‌బుక్ అమలు చేస్తే.. బెంబేలెత్తిపోతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.