ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా తలసేమియా బాధితుల కోసం ఏర్పాటు చేసిన యుఫోరియా మ్యూజికల్ నైట్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే పేదవారి ముఖంలో చిరునవ్వు, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే నమ్మకం. విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గారి స్ఫూర్తి, చంద్రబాబు గారి ఆలోచన, భువనేశ్వరి గారి ఆచరణ అని లోకేశ్ అన్నారు.
ఈ ఈవెంట్ కు స్పాన్సర్ చేసిన, టికెట్లు కొన్నవారందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు. తలసేమియా బాధితుల కోసం ఇచ్చిన ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడుతుందని చెప్పారు. 28 ఏళ్ల ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రస్థానంలో విద్య, వైద్యం, స్వయం ఉపాధి, సురక్షిత త్రాగు నీరు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సాయం చేయడంలో ఈ ట్రస్ట్ ముందుంటుందని, స్త్రీ శక్తితో మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడే శక్తినిచ్చింది ఈ ట్రస్ట్ అని అన్నారు. ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆశాజ్యోతి అని, ఆ కుటుంబంలోని పిల్లలకు విద్య, ఆర్థిక మద్దతును అందిస్తోందని చెప్పారు.
కోవిడ్-19 మహమ్మారి బాధితులను ఆదుకోవడాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ సవాలుగా స్వీకరించిందని, మాస్క్‌లు, మందులు, ఆక్సిజన్‌ను పంపిణీ చేయడంలో ముందుందని అన్నారు. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియల కోసం ఈ ట్రస్ట్ సాయం చేసిందన్నారను. ఇప్పటివరకు 8.70 లక్షల మంది రోగులకు రక్తాన్ని అందించామని, తలసేమియా, జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్న 200 మంది పిల్లలు ట్రస్ట్ నుండి రక్తాన్ని పొందుతున్నారని అన్నారు. 2,020 మంది అనాథలు పూర్తిగా ఉచిత వసతి, విద్యను ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తోందని తెలిపారు.