ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలో ‘‘యుఫోరియా మ్యూజికల్ నైట్’’ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తలసేమియా బాధితుల సహాయార్థం నిధుల సేకరణకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చంద్రబాబు చెప్పారు. ఆ ఆలోచన చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజ్ మెంట్, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిపై మరింత నమ్మకం పెరిగిందని తన సతీమణిని చంద్రబాబు ప్రశంసించారు.
హెరిటేజ్ తోపాటు ఎన్టీఆర్ ట్రస్ట్ ను కూడా సమర్థవంతంగా నడిపించే శక్తి భువనేశ్వరికి తండ్రి ఎన్టీఆర్ నుంచి వచ్చిందని కితాబిచ్చారు. ఎన్టీఆర్ ఎంత మొండి ఘటమో, భువనేశ్వరి కూడా అంతే మొండి ఘటం అని సరదాగా వ్యాఖ్యానించారు. విపత్తు సమయాల్లో ప్రజలను ఆదుకునేందుకు అన్నగారు ముందుండేవారని, అదే మాదిరిగా భువనేశ్వరి కూడా ఈ తరహా కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. లక్ష రూపాయలు పెట్టి టికెట్ కొంటేనే ఈ ఈవెంట్ కు రానిచ్చారని సెటైర్లు వేశారు.
“నేను డబ్బులు చెల్లించింది ట్రస్ట్ కు కాదు… తలసేమియా బాధితులకు…. అదే నాకు తృప్తి. ఇవాళ వండ్రఫుల్ ఈవెనింగ్… ఇంక ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే మీరు (సభికులు) నన్ను క్షమించరు… జై హింద్, జై ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్” అంటూ చంద్రబాబు అన్నారు.