ఎన్టీఆర్ ట్రస్ట్ 28వ వార్షికోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన యుఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్లో హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని చాటిచెప్పిన అన్నగారి ఆశయ సాధనకు తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలకు సాయం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రజలకు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పారు.
తమ తల్లిదండ్రులను స్మరించుకుంటూ సమాజ హితం కోసం కృషి చేస్తూనే ఉంటామని బాలయ్య చెప్పారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, విద్యాలయాలు, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నామని చెప్పేందుకు గర్విస్తున్నానని బాలయ్య చెప్పారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో తలసేమియా బాధిత చిన్నారులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు.
ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో తన సోదరుడు తమన్ ఆహుతులకు చక్కటి వినోదాన్ని అందిస్తాడని అన్నారు. ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కొన్ని రాగాలు రోగాలను కూడా నయం చేస్తాయని పురాణాల్లో కూడా ఉందని అన్నారు. తమన్ కు నందమూరి ఇంటిపేరు ఆపాదించి తమ సోదరులలో ఒకరిగా గౌరవించినందుకు ఆనందంగా ఉందన్నారు.