విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరయ్యారు. తమిళనాడు, కేరళలో దేవాలయాల సందర్శనను నేడు ముగించిన పవన్ కల్యాణ్ వెంటనే ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల భారీ విరాళాన్ని పవన్ ప్రకటించారు.
“ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టికెట్ కొనాలని నాఇ సిబ్బందికి చెప్పాను. ఈ విషయం తెలిసి నారా భువనేశ్వరి గారు… టికెట్ ఎందుకండీ… మీరు కార్యక్రమానికి రండి చాలు అన్నారు. కానీ నాకు టికెట్ కొనకుండా రావడం గిల్టీగా అనిపిస్తోంది. అందుకే నా వంతుగా తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ కు రూ.50 లక్షల విరాళం ప్రకటిస్తున్నాను’’ అని పవన్ చెప్పారు.
తన దగ్గరకు వచ్చిన బాధితులకు సాయం చేయాలని సీఎం చంద్రబాబు కార్యాలయానికి లేఖ రాస్తే ఆయన స్పందన అద్భుతంగా ఉంటుందన్నారు. ఎంత సేపూ పనే కాదు, సహాయంలోనూ వినోదం పొందవచ్చని ఈ మ్యూజికల్ నైట్ నిరూపించిందని చెప్పారు. ఈ ఈవెంట్ కు సంగీతం అందిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు అభినందనలు తెలిపారు పవన్.
నారా భువనేశ్వరి అంటే తనకు అమితమైన గౌరవం అని, ఆమె దృఢసంకల్పం, కష్టనష్టాల్లో వెనుకంజ వేయని స్ఫూర్తిదాయక తీరు గురించి తనకు తెలుసని చెప్పారు. బాలకృష్ణను సర్ అని పిలవాలనిపిస్తుందని, ఆయన మాత్రం బాలయ్య అని పిలవమంటారని చమత్కరించారు.
బాలకృష్ణ వ్యక్తిత్వం చాలా ప్రత్యేకం అని, ఎవరినీ లెక్క చేసే మనిషి కాదని అన్నారు. తరతరాలుగా ప్రేక్షకులను నటనతో అలరిస్తూనే…ఇటు రాజకీయాలు, సామాజిక సేవ చేస్తున్నారని, అందుకే ఆయనకు కేంద్రం పద్మభూషణ్ ప్రకటించిందని పవన్ అన్నారు.