కాపు నేస్తం ఓ బూటకం అని మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప మండిపడుతున్నారు. ఒక్క ఆయనే కాదు తూర్పు కాపు సంక్షేమం పేరిట శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కాపు నేస్తం వల్ల 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఆర్థికంగా అందే సాయం ఎందుకూ ఉపయోగపడదని, వ్యక్తిగత సాయాలతోనే ప్రభుత్వాలు జీవన ప్రమాణాలు అన్నవి మెరుగుపడతాయని అనుకోవద్దని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
ఏ విధంగా చూసుకున్నా సీఎం ఏడాదికి ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఐదేళ్ల కాల వ్యవధికి ఆయన చెబుతున్న లెక్క చూస్తే రెండు వేల ఐదు వందల కోట్లు. పోనీ మూడేళ్ల కాలంలో ఆయన చెబుతున్న లెక్కే రాసుకుంటే పద్నాలుగు వందల కోట్ల రూపాయలు పైమాటే (తొలుత కన్నా ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య పెరిగింది). ఎలా చూసుకున్నా, ఏ విధంగా రాసుకున్నా కాపు నేస్తం పథకం ద్వారా ఇక్కడెవ్వరూ ఆర్థికంగా సాధించిన ఉన్నతి అంటూ ఏమీ లేదని, కేవలం బడ్జెట్ లోనే కాపుల కోసం ఏటా వెయ్యి కోట్లు కేటాయించిన ఘనత తమ ప్రభుత్వానిది అని అని నిమ్మకాయల చిన రాజప్ప, మరో కాపు నేత జ్యోతుల నెహ్రూ అంటున్నారు.
మొత్తం మూడేళ్ల కాల వ్యవధిలో 32 వేల కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పడం, అన్ని పథకాలు కలిపి ఆ మేరకు ఆర్థిక లబ్ధి చేకూర్చామని చెప్పడం ఒక్క జగన్ కే చెల్లిందన్న విమర్శ విపక్షం నుంచి వస్తుంది. అంత మొత్తంలో నిధులు ఇచ్చిన వారు ఎందుకని కాపు ప్రభావిత ప్రాంతాలను, నియోజకవర్గాలను అనూహ్య స్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నారు అన్న విమర్శ కూడా వస్తోంది.
ఎలా చూసుకున్నా కేవలం 15 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం నిజంగానే కపట ప్రేమ అని టీడీపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. తాము కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పట్టుబట్టి చంద్రబాబు హయాంలోనే సాధించామని, కానీ వైసీపీ సర్కారు దానిని సైతం రద్దు చేసిందని వీరంతా మండిపడుతున్నారు.
మరోవైపు కాపులను ఓబీసీల్లో చేర్చాలన్న ప్రతిపాదనపై ఇప్పటిదాకా వైసీపీ వర్గాలు మాట్లాడడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీసీ కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి కాపులకు అందాల్సిన రాయితీలు అన్నీ రద్దు చేసి కేవలం ఏడాదికి పదిహేను వేలు ఇవ్వడం నిజంగానే తమకు అన్యాయం చేసిన వారే అవుతున్నారని వైసీపీ సర్కారును ఉద్దేశించి మరికొందరు విపక్ష పార్టీలకు చెందిన కాపు సంఘ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.