ఏపీ సీఎం, తన సోదరుడు జగన్పై కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల.. ఓ రేంజ్లో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వివేకానందరెడ్డి దారుణ హత్యను ఆమె పదే పదే ప్రస్తావిస్తున్నారు. తాజాగా శుక్రవారం కడపలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత.. కూడా హత్యా రాజకీయాలకు ముగింపు పలకాలంటే.. జగన్ను చిత్తుగా ఓడించాలని షర్మిల పిలుపునిచ్చారు. వివేకానందరెడ్డిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడే కాదు.. గత కొన్నాళ్లుగా ఆమె చేస్తూనే ఉన్నారు. అయితే.. సొంత జిల్లా కడపలో ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపించే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసింది. దీంతో వ్యూహాత్మకంగా షర్మిల నోరు నొక్కేసే తంత్రాన్ని తెరమీదికి తెచ్చిందని అంటున్నారు పరిశీలకులు.
ఏం జరిగింది?
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పై రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్, వైసీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఘాటుగా స్పందించారు. షర్మిల ప్రచారం ఎన్నికల నియమావళికి పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని తాము ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని స్పష్టం చేశారు. వ్యక్తిగత అజెండాతోనే షర్మిల.. సీఎం జగన్ పై నిందలు వేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. కోర్టు పరిధిలో ఉన్న(వివేకానందరెడ్డి హత్య కేసు) అంశాలపై మాట్లాడకూడదన్న విషయం షర్మిల తెలుసుకోవాలని హితవు పలికారు. ఎంతో తీవ్రమైన అంశంలో తీర్పు, శిక్ష ఈవిడే ఖరారు చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.
వైఎస్ కుటుంబాన్ని విడదీసే కుట్రలు ఈనాటివి కావని, కడప ప్రజలకు అన్నీ తెలుసని అన్నారు. షర్మిల చేస్తున్నవి సానుభూతి రాజకీయాలన్న విషయం అందరికీ అర్థమైందని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. షర్మిల ఎన్ని అంశాల్లో యూటర్న్ తీసుకున్నా రో అందరికీ తెలుసని విమర్శించారు. షర్మిల తీరు చూస్తుంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, రంగులు మార్చడంలో ఆమె చంద్రబాబును మించిపోయారని పద్మ వ్యాఖ్యానించారు. “నాడు అన్యాయంగా రాష్ట్రాన్ని విభజించారు, విభజన హామీలపై ఏంచేసింది కాంగ్రెస్ పార్టీ? ఏపీకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని గతంలో మీరు మాట్లాడలేదా?“ అంటూ షర్మిలను వాసిరెడ్డి పద్మ నిలదీశారు. కాగా.. వైసీపీ వ్యూహం ప్రకారం.. షర్మిలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. దీంతో ఆమె నోటికి తాళం పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.